kamal: త్వరలోనే కొత్త పార్టీ పెడతా.. రజనీకాంత్ కాషాయ పార్టీతో కలుస్తారనుకుంటున్నాను: కమల్
- నేను కేజ్రీవాల్‌ని కలవలేదు... ఆయనే నా వద్దకు వచ్చారు
- రజనీకాంత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం
- రజనీతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటా
- రజనీకాంత్‌కు బీజేపీయే సరైంది
- నేను హేతువాదిని, కులవ్యవస్థకు వ్యతిరేకిని
ఇటీవల సినీనటుడు కమలహాసన్ ఇంటికి వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆయనతో కాసేపు చర్చించి వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై కమలహాసన్ మరోసారి స్పందిస్తూ.. తాను కేజ్రీవాల్‌ని కలవలేదని, ఆయనే తన వద్దకు వచ్చారని చెప్పారు. కేజ్రీవాల్ తన వద్దకు రావడం ఆయన మంచితనాన్ని సూచిస్తోందని చెప్పారు. తాను కేజ్రీవాల్ పార్టీతో చేతులు కలపడం లేదని స్పష్టం చేశారు.
కాగా, తాను రాజకీయాల్లోకి వస్తున్న విషయాన్ని సినీనటుడు రజనీకాంత్‌కు చెప్పానని కమల్ అన్నారు. రజనీకాంత్‌తో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. అయితే, రజనీకాంత్‌కు బీజేపీయే సరైందని కమల్ వ్యాఖ్యానించారు. తాను రజనీతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటానని అన్నారు.
రజనీకున్న మత విశ్వాసాలను బట్టి చూస్తే ఆయన కాషాయ పార్టీతో కలుస్తారని తనకు అనిపిస్తోందని కమల్ చెప్పారు. తాను హేతువాదినని, కులవ్యవస్థకు వ్యతిరేకినని, కానీ తాను కమ్యూనిస్టును కాదని వ్యాఖ్యానించారు. కొత్త సంవత్సరం వచ్చేలోపే తాను పెట్టే కొత్త పార్టీ వివరాలు ప్రకటిస్తానని చెప్పారు.