dera baba: సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టుకి అప్పీలు చేసుకున్న డేరా బాబా
- పంజాబ్, హర్యానా హైకోర్టులో అప్పీలు
- సీబీఐ కోర్టు జాప్యం చేయడాన్ని ఆరోపిస్తూ పిటిషన్
- కేసులో ఎఫ్ఐఆర్ కూడా లేదన్న డేరా తరఫు న్యాయవాది
అత్యాచార కేసుల్లో దోషిగా నిర్ధారిస్తూ పంచకుల సీబీఐ కోర్టు తనకు 20 ఏళ్ల శిక్ష విధించడంపై డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టులో అప్పీలు దాఖలు చేసినట్లు డేరా బాబా తరఫు న్యాయవాది విశాల్ గార్గ్ నర్వానా తెలిపారు.
బాధిత మహిళల ఫిర్యాదులను రికార్డు చేయడంలో సీబీఐ కోర్టు ఆరేళ్లకు పైగా జాప్యం చేయడాన్ని ప్రధానంగా ఆరోపిస్తూ ఈ అప్పీలు దాఖలు చేసినట్లు ఆయన వివరించారు. 1999లో అత్యాచార సంఘటన జరిగితే, వారి స్టేట్‌మెంట్‌ను 2005లో సీబీఐ రికార్డు చేసిందని విశాల్ పేర్కొన్నారు. అలాగే బాధితులు చెప్పిన విషయాల్లో కొన్నింటిని సీబీఐ కోర్టు దాచి పెట్టిందని ఆయన చెప్పారు. అంతేకాకుండా బాధితులకు ఎలాంటి మెడికల్ పరీక్షలను కోర్టు నిర్వహించలేదని, ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని విశాల్ పేర్కొన్నారు.