acb raids: ఏపీ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ రఘు ఇంట విస్తుపోయే ఆస్తులు... 500 కోట్ల అక్రమ సంపాదన!

  • కళ్లు తిరిగే ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు
  • సుమారు 500 కోట్లు ఉంటాయని అంచనా

నిన్న ఏసీబీ అధికారులకు దొరికిపోయిన ఏపీ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ గొల్ల వెంకట రఘు అవినీతితో సంపాదించిన ఆస్తులు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. 1988 మే 11వ తేదీన మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా జాయినైన గొల్ల వెంకట రఘు అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ లలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1996లో డిప్యూటీ డైరెక్టర్‌ గా ఆయన ప్రమోషన్‌ అందుకున్నారు. ఆ హోదాలో నెల్లూరు, రాజమండ్రి కార్పొరేషన్‌ లో పనిచేశారు.

ఆ తరువాత 2002లో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కు సిటీ ప్లానర్‌ గా వచ్చారు. మళ్లీ 2004లో జాయింట్ డైరెక్టర్‌ గా పదోన్నతి పొంది విశాఖ జీవీఎంసీకి ట్రాన్స్‌ ఫర్ అయ్యారు. 2009 నవంబర్‌ లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ సిటీ ప్లానర్‌ గా పనిచేశారు. అక్కడే డైరెక్టర్‌ గా ప్రమోషన్‌ అందుకున్నారు. చివరగా 2015లో డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌ గా ప్రమోషన్ పొందారు. మరో వారం రోజుల్లో ఆయన రిటైర్ కానున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నిఘా వేసిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో రఘు అతని బినామీలు, బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో బయటపడ్డ ఆస్తులు చూసి ఆశ్చర్యపోయారు. సుమారు 500 కోట్ల రూపాయల అక్రమాస్తులు చూసి నోరెళ్ల బెట్టారు.

ఆ ఆస్తుల వివరాల్లోకి వెళ్తే...
కృష్ణా జిల్లా గన్నవరం వద్ద 300 ఎకరాల్లో వెంచర్, బొమ్ములూరులో 1,033 చదరపు గజాల ఇంటి స్థలం, తాడేపల్లిలో నివాస స్థలాలు, మంగళగిరి కొండపనేని లేఅవుట్‌ లో 220 చదరపు గజాల స్థలం, చిత్తూరు జిల్లా పులివెల్లంలో 2 ప్లాట్లు, విశాఖలోని బీచ్ రోడ్డులో 80 లక్షల విలువైన ఫ్లాట్, షిర్డీలోని సూరజ్ కుంజ్ లాడ్జ్, డూప్లెక్స్‌ హౌస్‌, 12 లక్షల రూపాయల విలువైన బంగారం, 5 లక్షల రూపాయల విలువైన గృహోపకరణాలు, 10 లక్షల రూపాయల నగదు, మంగళగిరిలోని రఘు నివాసానికి సమీపంలోని ఒక అపార్ట్‌ మెంట్‌ లో ఆయనకు చెందిన రెండు కార్లు గుర్తించారు.

అలాగే ఆయన బినామీ అయిన శివప్రసాద్‌ (గుణదల) నివాసంలో భారతీనగర్‌ లో 16 ఫ్లాట్లు, గన్నవరం సమీపంలోని చినఅవుట్‌ పల్లి 1.40 ఎకరాల్లో సాయి మిథిల కన్వెన్షన్‌ హాల్‌. శివప్రసాద్ భార్య గాయత్రి పేరుతో భారతీనగర్, గుణదలలో రెండు భవనాలు. మరికొన్ని చోట్ల 11.65 ఎకరాల పొలముంది. అంతేకాకుండా ఆమె పేరు మీద సాయి సదన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్, సాయి సుధా అవెన్యూ ప్రైవేటు లిమిటెడ్, సబురి బిల్డర్స్‌ ప్రైవేటు లిమిటెడ్, శ్రీ మాతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అనే కంపెనీలున్నాయి. వారి కుమార్తె పేరుతో భారతీనగర్‌ లో 80 లక్షల రూపాయల విలువైన స్థలం, అలాగే హైదరాబాదులోని కొండాపూర్‌ లో ఒక ప్లాట్‌ ఉన్నాయి.

శివప్రసాద్‌ కుటుంబసభ్యులు, బంధువుల పేరు మీద విజయవాడలోని గుణదల, భారతీనగర్, కృష్ణా జిల్లాలోని పోతేపల్లి, బొమ్ములూరు, గుంటూరు జిల్లా కటికలపూడి, సుకృతికోటపాడు ప్రాంతాల్లో 18కి పైగా ఖరీదైన ఇళ్ల స్థలాలు. 8 కేజీల బంగారు, వజ్రాభరణాలు, 23 కేజీల వెండి వస్తువులు, 44 లక్షల రూపాయల నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు చిత్తూరు జిల్లా రాంపల్లెలోని రఘు అత్త కళావతమ్మ ఇంట్లో కొన్ని ఆస్తులు, అతని బినామీ విశాఖ ఆశీల్‌ మెట్టలోని ప్రైవేటు సర్వేయర్‌ గోవిందరాజు ఇంట్లో 2.5 లక్షల రూపాయల నగదు, పలు రికార్డులు స్వాధీనపరుచుకున్నారు. కిర్లంపూడిలోని రఘు స్నేహితుడు కాంట్రాక్టర్‌ భాస్కరరెడ్డి ఇంట్లో సోదాలు చేసి, పలు రికార్డులు తీసుకెళ్లారు. మరోసారి నిన్న సాయంత్రం ఏసీబీ అధికారులు ఆయన నివాసం దగ్గరకి వెళ్లగానే...ఏసీబీ అధికారుల బృందాన్ని చూసిన రఘు, వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి, తన ఇంట్లోకి రావొద్దంటూ కేకలు వేశారు. అంతేకాకుండా అరెస్ట్‌ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు.  

  • Loading...

More Telugu News