mahesh kathi: జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మహేష్ కత్తి!
* క్రిటిక్స్ ను విమర్శించడం సరికాదు
* తమ అభిప్రాయాలను బట్టి సినిమాను ప్రేక్షకులు చూస్తారనే దాంట్లో వాస్తవం లేదు
* క్రిటిక్స్ గురించి మాట్లాడకండి
* నాలాంటి వారికి అనవసరంగా పాప్యులారిటీ తీసుకురావద్దు
'జై లవకుశ' విజయోత్సవ సభలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను సినీ క్రిటిక్ మహేష్ కత్తి ఖండించాడు. సినిమాలపై విమర్శ అనేది సినిమాని బట్టే ఉంటుందని... క్రిటిక్స్ ను బట్టి సినిమాలు తయారవవని అన్నాడు. సినిమా ఎలా ఉందనేది ప్రేక్షకులే డిసైడ్ చేస్తారని... వాళ్ల అభిప్రాయాలను వెల్లడించేవాడే క్రిటిక్ అని చెప్పాడు. ప్రేక్షకుడు తన అనుభూతిని మాత్రమే చెబుతాడని... క్రిటిక్ తన అనుభూతినే కాకుండా, ఆలోచనలను కూడా పంచుకుంటాడని తెలిపాడు. అలాంటప్పుడు ప్రేక్షకుడికి ఉన్న హక్కు, క్రిటిక్ కు లేదని అనడం తప్పని అన్నాడు. ఇది వాక్ స్వాతంత్ర్యానికి విరుద్ధమని చెప్పాడు.
ఒక విశ్లేషకుడు చెప్పిన అభిప్రాయాన్ని బట్టి ప్రేక్షకులు సినిమా చూస్తారనే దాంట్లో వాస్తవం లేదని మహేష్ అన్నాడు. క్రిటిక్స్ అందరూ కూడా సినిమా బాగోలేదనే రేటింగ్ ఇచ్చినా... ఆ సినిమా రూ. 100 కోట్లు వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పాడు. క్రిటిక్ అభిప్రాయం వల్లే సినిమా ఆడలేదనే విషయాన్ని తాను నమ్మనని తెలిపాడు. అనవసరంగా క్రిటిక్స్ గురించి మాట్లాడుతూ, తనలాంటివారికి అనవసరంగా పాప్యులారిటీ పెంచుతున్నారని అన్నాడు. క్రిటిక్స్ కు పాప్యులారిటీ అనవసరమని... వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దని సూచించాడు.