mithali raj: మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితకథతో సినిమా?
- నిర్మాణ సన్నాహాలు చేస్తున్న వయోకామ్18
- వెండితెరపై మరో క్రికెటర్ బయోపిక్
- ఆనందం వ్యక్తం చేసిన మిథాలీ
క్రీడాకారుల బయోపిక్‌లకు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి డిమాండ్ ఉంది. గతంలో వచ్చిన `ఎంఎస్ ధోనీ`, `మేరీ కోం`, `అజహర్`, `సచిన్` ఇలా అన్ని క్రీడాకారుల బయోపిక్‌లు హిట్లే. ఇదే బాటలో కొత్తగా సైనా నెహ్వాల్, జులన్ గోస్వామిల బయోపిక్‌లు కూడా నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితకథ ఆధారంగా కూడా సినిమాను రూపొందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆమె జీవితకథకు సంబంధించిన హక్కులను ఇటీవల ప్రముఖ నిర్మాణ సంస్థ వయోకామ్18 మోషన్ పిక్చర్స్ వారు సొంతం చేసుకున్నారు. పదహారేళ్ల వయసులో క్రికెట్ బ్యాట్ పట్టుకుని, వన్డేల్లో సెంచరీ చేసిన చిన్నవయసు మహిళా క్రికెటర్‌గా మిథాలీ నిలిచారు. మహిళా క్రికెట్లో సచిన్ టెండూల్కర్‌గా పిలిచే మిథాలీ రాజ్ జీవితకథ హక్కులు దక్కించుకోవడం ఆనందంగా ఉందని వయోకామ్18 ప్రతినిధి అజిత్ అంధారే తెలిపారు. ఈ చిత్రాన్ని అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకుని ఆటల్లో రాణించాలని కోరుకుంటున్నట్లు మిథాలీ వెల్లడించారు.