contract marriages: పది మంది పాతబస్తీ యువతులను వివాహం చేసుకున్న అరబ్ షేక్...మళ్లీ పెళ్లికి వచ్చాడు!: వెల్లడించిన డీసీపీ సత్యనారాయణ
- కాంట్రాక్టు పెళ్లిళ్లు చేసే ఖాజీ అరెస్టు
- వయసు మళ్లిన వరుడికి క్రానిక్ కిడ్నీ డిసీజ్
- ఇద్దరు దుబాయ్ షేక్ లు, యెమన్ దేశీయులు, బ్రోకర్లు, ఖాజీ అరెస్టు
- పదకొండో కాంట్రాక్ట్ వివాహానికి పాతబస్తీ వచ్చిన షేక్
ఇప్పటికే పది మంది యువతులను వివాహం చేసుకుని, మరో యువతిని వివాహం చేసుకునేందుకు దుబాయ్ నుంచి హైదరాబాదుకు ఒక అరబ్ షేక్ వచ్చాడని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదులోని పాతబస్తీలో దాడులు నిర్వహించిన పోలీసులు మొన్న ఐదుగురు దుబాయ్ షేక్ లు, ఐదుగురు యెమన్ దేశస్తులతో పాటు వారికి వివాహాలు జరిపించిన ఖాజీలు, బ్రోకర్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
రాత్రి జరిపిన తనిఖీల్లో వివాహం నిర్వహించేందుకు సిద్ధమైన ఖాజీని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు చూసి షాక్ తిన్నారు. వాటిల్లో, ఇప్పటికే పది వివాహాలు చేసుకుని పదకొండో వివాహం కోసం హైదరాబాదు పాతబస్తీకి వచ్చిన అరబ్ షేక్ వివరాలు తెలుసుకుని షాక్ తిన్నారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు.
దుబాయ్ ఎంబసీతో మాట్లాడి అతనిని వెనక్కి పంపనున్నట్టు తెలిపారు. వయసు మళ్లిన ఆ వ్యక్తి క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో బాధపడుతున్నాడని ఆయన తెలిపారు. నిషేధిత మందులు ఆయన వద్ద ఉన్నాయని, దీనిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయనతో పాటు మరొక షేక్ ను, యెమన్ దేశీయులను, కాంట్రాక్ట్ మేరేజ్ బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ తెలిపారు. ఇలాంటి వివాహాల కోసం హైదరాబాదులో అడుగుపెట్టాలంటే భయపడేలా చేస్తామని ఆయన హెచ్చరించారు.