ma economics: 97 ఏళ్ల వయసులో ఎంఏ పాసైన ఉత్తర ప్రదేశ్ వృద్ధుడు
- ఆర్థిక శాస్త్రంలో ద్వితీయ తరగతి మార్కులు పొందిన రాజ్‌కుమార్
- ఆశ్చర్యం వ్యక్తం చేసిన నలంద ఓపెన్ యూనివర్సిటీ అధికారులు
- అభినందనలు తెలిపిన కుటుంబీకులు
చదువుకు వయసుతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ వైశ్య, నలంద ఓపెన్ యూనివర్సిటీ వెల్లడించిన ఎంఏ ఆర్థిక శాస్త్రం ఫైనల్ ఎగ్జామ్స్ ఫలితాల్లో ఉత్తీర్ణుడిగా నిలిచాడు. ఇందులో విశేషం ఏంటంటే... ఆయన వయసు అక్షరాల 97 ఏళ్లు. 1920, ఏప్రిల్‌లో జన్మించిన రాజ్కుమార్కి ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి పదవీ విరమణ కూడా చేశారు.
చదువు విషయంలో రాజ్ కుమార్ చూపించిన అంకిత భావానికి యూనివర్సిటీ అధికారులు, ఉపాధ్యాయులు కూడా షాక్ తిన్నారు. 1938లో ఆగ్రా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన రాజ్‌కుమార్ అందరు విద్యార్థుల లాగే పరీక్షలు రాయడానికి యూనివర్సిటీకి వచ్చేవాడని నలంద ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎస్పీ సిన్హా తెలిపారు. ఎంఏ పరీక్షల్లో ద్వితీయ తరగతిలో పాసైన విషయం తెలిశాక రాజ్‌కుమార్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. అతని కుమారులు, కోడళ్లు, మనమళ్లు, మనవరాళ్లు అభినందనలు తెలియజేశారు.
తను చదువుకోవడం కోసం టీవీ సీరియళ్లు చూడటం మానేసిన తన పెద్ద కోడలికి రాజ్‌కుమార్ కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాకుండా తనకి మొదటి తరగతి మార్కులు రావాల్సిందని, ద్వితీయ తరగతిలో పాసవడం కొంత బాధగా ఉందని రాజ్‌కుమార్ తెలిపాడు. త్వరలో పేదరికం, నిరుద్యోగం గురించి వ్యాసాలు రాస్తానని చెప్పాడు.