predictive policing: నేరాన్ని ముందుగానే అంచనా వేయగల సాఫ్ట్‌వేర్... సిద్ధం చేస్తున్న ఎన్‌సీఆర్‌బీ!
- మొదట ఐదు రాష్ట్రాల్లో అమలు
- 2018 చివరికల్లా అన్ని రాష్ట్రాలకు
- బిగ్‌డేటా అనలిటిక్స్ సాయంతో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి
`స్పైడర్` సినిమాలో మహేశ్ బాబు చెబుతున్నట్లుగా ఎక్కడ నేరం జరిగినా, హెల్ప్ అని అరిచినా ముందే తెలిపే సాఫ్ట్‌వేర్ ఆధారిత పోలీసింగ్ విధానాన్ని త్వరలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) అమల్లోకి తీసుకురానుంది. దీన్ని `ప్రెడిక్టివ్ పోలీసింగ్` విధానం అంటారు. తమ వద్ద అందుబాటులో ఉన్న నేరాల డేటాబేస్ ఆధారంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, డేటాబేస్‌లో ఉన్న నేరాల పరిస్థితులను పోలిన పరిస్థితులు ఎక్కడైనా కనిపిస్తే ఆయా ప్రాంతాల్లో నేరం జరగబోతోందనే విషయాన్ని ముందే ఊహించే సదుపాయం కలుగుతుంది.
మార్చి 2018లోగా ఈ విధానాన్ని కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, త్రిపుర రాష్ట్రాల్లో అమల్లోకి తీసుకురానున్నారు. అలాగే 2018 చివరికల్లా దేశవ్యాప్తంగా ప్రెడిక్టివ్ పోలీసింగ్ విధానాన్ని ఉపయోగించనున్నారు. బిగ్‌డేటా అనలిటిక్స్ సాయంతో హైద్రాబాద్‌కి చెందిన అడ్వాన్స్‌డ్ డేటా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఏడీఆర్ఐఎన్) ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేస్తున్నట్లు సమాచారం.
కేవలం నేరాలు, హత్యలనే కాకుండా ఉగ్రవాదులు, మావోయిస్టుల దాడిని కూడా ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా పసిగట్టే అవకాశం కలగనుందని ఎన్‌సీఆర్‌బీ డైరెక్టర్ ఇష్ కుమార్ తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్ కేవలం అంచనాలు మాత్రమే వేయగలిగినప్పటికీ అమెరికా వంటి దేశాల్లో దీని సాయంతో మంచి ఫలితాలను పోలీసులు సాధించారు. ఒక ప్రాంతంలో నివసించే జాతులు, వర్గాలు, ఆ ప్రాంత జనాభా, జీవన విధానాలు, ప్రవర్తన తీరు, సామాజిక సమస్యలు అనేవి ఒక ప్రదేశం నేరమయ ప్రాంతమా? కాదా? అనేది అంచనా వేయడంలో ఉపయోగపడతాయి.