satya nadella: భార్య కోసం ఆ పని చేశానంటే ఎంతో వింతగా చూశారు: సత్య నాదెళ్ల

  • భార్య కోసం గ్రీన్ కార్డును వదులుకున్నా
  • ఆపై హెచ్-1బీ కోసం దరఖాస్తు చేస్తే పెద్ద చర్చే జరిగింది
  • క్రికెటర్ ను కావాలన్న కోరిక ఉండేది
  • 'హీట్ రిఫ్రెష్' పుస్తకంలో సత్య నాదెళ్ల

తనకు వివాహమైన కొత్తల్లో భార్య అనుపమ కోసం గ్రీన్ కార్డును వదిలేసుకుని హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసిన వేళ, ప్రతి ఒక్కరూ తనను వింతగా చూశారని, అంత అవకాశాన్ని ఎందుకు వదులుకున్నావన్న ప్రశ్న ఎంతో మంది నుంచి ఎదురైందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. తాను రాసిన సరికొత్త పుస్తకం 'హీట్ రిఫ్రెష్'ను విడుదల చేసిన ఆయన, ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రీన్ కార్డులు ఉన్నవారికి, యూఎస్ నిబంధనల కారణంగా భార్యను తీసుకురాలేని పరిస్థితి ఉంటుందని గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో తాను సియాటెల్ లో ఉండేవాడినని, భార్యను తీసుకురావడం కుదరకపోవడంతో, గ్రీన్ కార్డును వదిలేసుకున్నానని తెలిపారు. అందులో వింతేమీ లేకపోయినా, సంస్థలో అది పెద్ద చర్చకు తెరలేపిందని అన్నారు. 1994లో ఇది జరిగిందని, ఢిల్లీలోని యూఎస్ ఎంబసీకి వెళ్లి గ్రీన్ కార్డు రిటర్న్ చేసి, హెచ్-1బీకి దరఖాస్తు చేస్తే, అక్కడి ఉద్యోగి చాలా వింతగా చూసి కారణాన్ని అడిగాడని, అప్పుడు అమెరికా వలస విధానం గురించి తాను వివరించగా, నిజమేనన్నట్టు చూసి దరఖాస్తు ఇచ్చాడని, ఆ వెంటనే తనకు హెచ్-1బీ కూడా వచ్చిందని, సియాటెల్ వెళ్లి యూఎస్ లో కొత్త జీవితాన్ని ప్రారంభించానని చెప్పుకొచ్చారు.

ఇదే సమావేశంలో హైదరాబాద్ లో చదువు గురించి ప్రస్తావిస్తూ, ఇంటర్ చదివేంతవరకూ హైదరాబాద్ తరఫున క్రికెట్ ఆడాలని కోరికగా ఉండేదని, ఇలా విదేశాలకు వెళ్తానని ఊహించలేదని చెప్పారు. హెచ్పీఎస్ (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్)లో చదివిన ఇతర విద్యార్థుల గురించి ప్రస్తావిస్తూ, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌, మాస్టర్‌ కార్డ్‌ చీఫ్ అజయ్‌ సింగ్‌ బంగా, కావియమ్‌ నెట్‌ వర్క్స్‌ అధినేత సయ్యద్‌ బి. అలీ, ఫైర్‌ ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ ఫౌండర్ ప్రేమ్‌ వత్స తదితరులతో పాటు ఎంతో మంది పార్లమెంటేరియన్లు, సినిమా తారలు, క్రీడాకారులు, రచయితలు ఇక్కడే చదివారని గుర్తు చేశారు. తన పుస్తకంలో ఆధార్ గురించి, డిజిటల్ దిశగా ఇండియా పయనాన్ని గురించి ప్రశంసించారు. స్టార్టప్ కంపెనీలకు ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహం గురించి వివరించారు. క్యాష్ లెస్ లావాదేవీల సంఖ్య భారత్ లో గణనీయంగా పెరుగుతోందని అన్నారు.

  • Loading...

More Telugu News