Mahamana Express: తొలి రోజే రైలును దోచేసిన ప్రయాణికులు.. దొరికింది దొరికినట్టు ఊడ్చుకుపోయిన వైనం!
- టాయిలెట్‌లోని ట్యాప్లనూ వదలని ప్రయాణికులు
- విస్తుపోయిన రైల్వే అధికారులు
తొలి రోజు అందంగా ముస్తాబై ప్రయాణం ప్రారంభించిన రైలుపై ప్రయాణికుల కన్ను పడింది. అంతే.. తిరుగు ప్రయాణంలో అందవిహీనంగా తయారై గమ్యానికి చేరుకుంది. రైలుపై పడిన ప్రయాణికులు దొరికిన దానిని దొరికినట్టు దోచేసి ఎంచక్కా ఇంటికి పట్టుకుపోయారు. ప్రయాణికుల చేతిలో దోపిడీకి గురైన ఆ రైలు పేరు ‘మహామానా’ ఎక్స్‌ప్రెస్. వడోదర-వారణాసి మధ్య చక్కర్లు కొట్టే ఈ రైలును ప్రధాని నరేంద్రమోదీ గత శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ప్రధాని జెండా ఊపగానే పరుగు ప్రారంభించిన రైలు శనివారం వారణాసి చేరుకుంది. ఆదివారం తిరిగి వడోదరకు వచ్చింది. అయితే ముస్తాబై వెళ్లిన రైలు కళావిహీనంగా చేరుకోవడంతో రైల్వే అధికారులు ముక్కున వేలేసుకున్నారు. కోచ్‌ల రూపురేఖలు మారిపోయాయి. జనరల్ కోచ్‌లలోని టాయిలెట్లు కళావిహీనమయ్యాయి. అందులోని ట్యాప్‌లు, హ్యాండ్ షవర్లను ప్రయాణికులు విప్పి తీసుకెళ్లిపోయారు.
ఇక కార్పెట్లను కూడా వదల్లేదు. దొరికిన వాటిని దొరికినట్టు తీసుకెళ్లినట్టు పశ్చిమ రైల్వే ప్రజాసంబంధాల అధికారి రవీందర్ భకర్ తెలిపారు. తామేమో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తుంటే వారు ఇలా ఉన్నవాటిని దోచుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే సొత్తు దోచుకెళ్లిన ప్రయాణికులు వెళ్తూవెళ్తూ అద్దాలను కూడా ధ్వంసం చేయడం కొసమెరుపు.