Saudi King: సౌదీ మహిళలు ఇక డ్రైవింగ్ చేసుకోవచ్చు.. నిషేధాన్ని ఎత్తేసిన సౌదీ కింగ్!
- ప్రపంచంలో మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఉన్న దేశం ఇదొక్కటే
- తాజా నిర్ణయం వచ్చే ఏడాది నుంచి అమలు
- హర్షం వ్యక్తం చేసిన అమెరికా
సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ రాజు సల్మాన్ ఎత్తివేశారు. ఈ మేరకు మంగళవారం రాయల్ డిక్రీ జారీ చేశారు. ఫలితంగా ఇక మహిళలు ఎంచక్కా డ్రైవింగ్ చేసుకోవచ్చు. మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఉన్న దేశం ప్రపంచంలో ఇదొక్కటే. అయితే కొత్త రూల్స్ మాత్రం వచ్చే ఏడాది జూన్ నుంచి అమల్లోకి వస్తాయి. మహిళల డ్రైవింగ్‌పై నిషేధం హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో స్పందించిన రాజు ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
సౌదీ నిర్ణయంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ‘సరైన మార్గంలో గొప్ప ముందడుగు’ అని అభివర్ణించింది. ఇకపై అరబ్ దేశం యంగ్, డైనమిక్, ఓపెన్ సొసైటీగా మార్పు చెందుతుందని అమెరికా విదేశీ అధికార ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈనెల 24న దేశ 87వ వార్షికోత్సవం సందర్భంగా తొలిసారి మహిళలను స్టేడియంలోకి అనుమతిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.