Allegiant Air jet: విమానంలో అలముకున్న పొగ... ఉక్కిరిబిక్కిరైన ప్రయాణికులు... ఎమర్జెన్సీ ల్యాండింగ్
- మార్గమధ్యంలో విమానంలో పొగ
- ఎమర్జెన్సీ ల్యాండింగ్
- విమానంలో 150 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది
విమానంలో అలముకున్న పొగతో ఉక్కిరిబిక్కిరైన ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురైన ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. లాస్ వెగాస్ నుంచి 150 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో బయల్దేరిన ఎలిగెంట్ జెట్ ఎయిర్ వేస్ విమానంలో అకస్మాత్తుగా పొగ అలముకుంది. దీంతో వేగంగా స్పందించిన పైలట్ ఏటీసీని సంప్రదించి, హుటాహుటీన కాలిఫోర్నియా సెంట్రల్ వ్యాలీలోని ఫ్రాన్సో యొస్మైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని దించేశారు.
విమానం కిందికి దిగగానే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రయాణికులు, సిబ్బంది తమ షర్టులను ముఖానికి అడ్డం పెట్టుకుని, తీవ్రంగా దగ్గుతూ కిందికి దిగారు. సాంకేతిక లోపం కారణంగా విమానంలో పొగ అలముకుందని విమాన సంస్థ తెలిపింది. ప్రయాణికులు, సిబ్బందిలో ఎవరూ అస్వస్థతకు గురికాలేదని పేర్కొంది. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానం చేర్చామని తెలిపారు.