torture: క్రిస్టియన్‌ను పెళ్లాడిందని హిందూ యువతికి టార్చర్.. బంధించి 22 రోజులు హింసించిన వైనం!

  • కుటుంబ సభ్యుల ఘాతుకం
  • భర్తను వదిలేసి రావాలని బెదిరింపులు
  • లేకుంటే భర్తను చంపేస్తామని హెచ్చరిక

క్రిస్టియన్ యువకుడిని పెళ్లాడిన హిందూ యువతికి 22 రోజుల పాటు నరకం చూపించారు. ఓ గదిలో బంధించి హింసించారు. యువకుడితో తెగదెంపులు చేసుకోమని బలవంతం చేశారు. కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

హిందూ యువతి అయిన 28 ఏళ్ల శ్వేత ఓ క్రిస్టియన్ యువకుడిని పెళ్లాడింది. ఇది కుటుంబ సభ్యులకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఆమెను తీసుకొచ్చి ఆ పెళ్లిని పెటాకులు చేయాలంటూ స్వయంగా కుటుంబ సభ్యులే కొందరిని నియమించారు. దీంతో వారు శ్వేతను తీసుకొచ్చి ఓ యోగా కేంద్రంలో బంధించి కాళ్లు చేతులు కట్టేశారు. 22 రోజులపాటు తనను శారీరకంగా, మానసికంగా హింసించారని శ్వేత కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది. వారి లక్ష్యం ఒకటేనని, తన భర్తను విడిచిపెట్టి రావాల్సిందిగా బలవంతం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

నిజానికి వారు తనను బంధించిన యోగా సెంటర్ యాంటీ కన్వెర్షన్ సెంటర్ అని శ్వేత వివరించింది. హిందూ మత ధర్మానికి వ్యతిరేకంగా క్రిస్టియన్, ముస్లింలను పెళ్లి చేసుకునే వారిని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇస్తుంటారని, తన భర్తను వదిలేయాల్సిందిగా బలవంతం చేశారని ఆమె పేర్కొంది. ఈ క్లినిక్‌లో తనలాగే మరికొందరిని బంధించారని, ఇటీవల ఇస్లాం నుంచి తిరిగి హిందూమతంలోకి వచ్చిన అథిర కూడా తనకు అక్కడ కనిపించిందని తెలిపింది.

కన్నూరుకు చెందిన శ్వేత అయుర్వేద వైద్యురాలు. త్రిసూర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ రింటో ఐజాక్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో నవంబరు 8, 2016 అతడితో వెళ్లి పెళ్లి చేసుకుంది. రింటో కుటుంబ సభ్యులు వారి వివాహాన్ని ఆమోదించారు. ఇద్దరూ చాలా ఆనందంగా గడుపుతుండడంతో శ్వేత కుటుంబ సభ్యులు కూడా వారితో మాటలు కలిపారు.

జూన్ 28న శ్వేత ఆమె సోదరి ఇంటికి వెళ్లింది. అక్కడికి వచ్చిన వారి తల్లిదండ్రులు శ్వేతకు కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్తను వదిలేసి రావాలని బలవంతం చేశారు. ఒకవేళ ఇద్దరూ కలిసి ఉండాలంటే అతడు హిందూమతంలోకి రావాల్సిందేనని పట్టుబట్టారు. అందుకు తాను అంగీకరించకపోవడంతో భర్తను చంపేస్తానని బెదిరించారని, చివరికి తనను బలవంతంగా కౌన్సెలింగ్ కోసం తీసుకెళ్లి 22 రోజులు బంధించి హింసించారని శ్వేత ఆరోపించింది.

  • Loading...

More Telugu News