minor girl: పోలీసు వాహనంలోనే తీసుకెళ్లి బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఖాకీలు

  • మైనర్ బాలికపై పోలీసుల సామూహిక అత్యాచారం
  • కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు
  • మీడియాలో వెలుగులోకి వచ్చిన దారుణం
  • స్పందించిన ఎస్పీ, నిందితుల సస్పెన్షన్ 

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాల్సిన పోలీసులే ఓ మైనర్ బాలిక జీవితాన్ని కాటేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోవింద్ నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఇన్స్ పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్ లు స్థానికంగా నివాసం ఉంటున్నారు. తమ బాధ్యతలను మరిచి, పదో తరగతి చదివే ఓ విద్యార్థినిని ప్రతి రోజు వేధించేవారు.

ఈ క్రమంలో ఇటీవల రోడ్డుపై వెళుతున్న బాలికను వారు అడ్డగించారు. పోలీస్ వాహనంలోకి బలవంతంగా ఎక్కించుకుని, ఓ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లారు. తనను ఏమీ చేయవద్దని బాధితురాలు వేడుకుంటున్నా వారు కరుణించలేదు. ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే, తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించి, బాధితురాలిని ఓ ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయారు.

ఇంటికి వెళ్లిన బాలిక, జరిగిన విషయం గురించి కుటుంబసభ్యులకు తెలిపింది. వెంటనే వారు గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే, కేసు నమోదు చేయని పోలీసులు, వారిని బెదిరించి ఇంటికి పంపించేశారు. అయితే ఈ విషయాన్ని సామాజిక కార్యకర్త లక్ష్మీ గౌతమ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మీడియాలో కూడా ఈ విషాదం వెలుగు చూడటంతో.. మథుర ఎస్పీ విచారణకు ఆదేశించారు. దీంతో, నిందితులపై కేసు నమోదైంది. దుర్మార్గానికి పాల్పడ్డ ఇన్స్ పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. విద్యార్థినిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News