stocks multi baggers: రెండు మూడేళ్లలో మీ సంపదను రెట్టింపు చేసే షేర్లు ఇవే...?!

  • రెండు మూడేళ్ల పాటు వేచి చూడాల్సి ఉంటుంది
  • మంచి రాబడులను అందించే అవకాశాలు ఎక్కువ
  • ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఐఐఎఫ్ఎల్ సూచనలు

ఇన్వెస్టర్లకు గొప్ప రాబడులను అందించే సాధనాల్లో ఈక్విటీ లు ముందుంటాయి. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారు. మార్కెట్లు స్వల్ప కాలంలో పడిపోవడం, పెరగడం సర్వసాధారణంగా జరిగే చర్యలు.  కానీ, దీర్ఘకాలానికి మన ఈక్విటీలు మెరుగైన రాబడులనే పంచుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బాగా రాణించే, వచ్చే రెండు మూడేళ్ల కాలంలో పెట్టిన పెట్టుబడిపై రెట్టింపునకు పైగా రాబడులను అందించే షేర్ల గురించి ఇండియా ఇన్ఫోలైన్ లిమిటెడ్ తెలియజేసింది.

1. భారత్ ఎలక్ట్రానిక్స్
రక్షణరంగంపై భారీ స్థాయిలో నిధులు ఖర్చు చేస్తున్నాం. ఎక్కువ ఉత్పత్తులను, ఆయుధాలను, సామగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. దీంతో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు భారత్ లో తయారీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రక్షణ రంగంలో దేశీయ కంపెనీలకు, ముఖ్యంగా భారత్ ఎలక్ట్రానిక్స్ కు అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాలున్నాయి. ఇప్పటికే కంపెనీ వద్ద పెండింగ్ లో భారీ ఆర్డర్లున్నాయి. అలాగే, సామర్థ్య విస్తరణ, కొత్తగా పరీక్షా కేంద్రాల ఏర్పాటుతో రానున్న 4 నుంచి 5 ఏళ్ల కాలంలో ఈ కంపెనీకి చక్కని వృద్ధి అవకాశాలున్నాయి.

2. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ
జీవిత బీమా రంగంలో ప్రైవేటు రంగంలో ప్రముఖ కంపెనీ ఇది. వినియోగదారులకు నచ్చే ఉత్పత్తులు తీసుకురావడం, అత్యుత్తమ కస్టమర్ సర్వీసు అందించడం, పరిహారాల కోసం వచ్చే దరఖాస్తుల పరిష్కరణ తదితర అంశాల్లో తన సేవలను మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టింది. మన దేశంలో జీవిత బీమా రక్షణ కలిగిన వారు ఐదు శాతం కూడా దాటలేదు. దీంతో భవిష్యత్తు భారీ అవకాశాలను అందుకునేందుకు భిన్న విధాలైన ఉత్పత్తుల రూపకల్పన, పంపిణీ చేయాలనుకుంటోంది.

3. హిందుస్థాన్ జింక్
జింక్ ఉత్పత్తిలో అగ్రగామి కంపెనీ ఇది. డై క్యాస్ట్ అలాయ్స్ తోపాటు వెండికి సంబంధించి విలువ ఆధారిత ఉత్పత్తులను తీసుకురావడంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రానున్న 3 నుంచి 5 ఏళ్ల కాలంలో జింక్ ఉత్పత్తినంతా కూడా విలువ ఆధారిత ఉత్పత్తులుగానే బయటకు తీసుకురావాలన్నది కంపెనీ ప్రణాళిక. అంతర్జాతీయంగా మార్కెట్ షేరును సైతం పెంచుకోవాలనుకుంటోంది.

4. సుప్రజిత్ ఇంజనీరింగ్
ఆటోమొబైల్ కేబుల్స్ తయారీలో ప్రముఖ కంపెనీ అయిన సుప్రజిత్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ కంపెనీల నుంచి వచ్చే ఆర్డర్ల డిమాండ్ మేరకు పనిచేయాలనుకుంటోంది. కేబుల్స్ ను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం ద్వారా వృద్ధి చెందాలనుకుంటోంది. కొనుగోలు చేసిన కంపెనీల విలీనంతోపాటు సామర్థ్య విస్తరణ ద్వారా కంపెనీ లాభదాయకత రానున్న సంవత్సరాల్లో మెరుగుపడనుంది.

5. ఇంజనీర్స్ ఇండియా
చమురు, గ్యాస్ రంగంలో డిజైనింగ్, ఇంజనీరింగ్ సేవల్లో అగ్రగామి కంపెనీగా ఉండడంతో ఈ రంగంలోని కంపెనీలు విస్తరణపై చేసే వ్యయాల వల్ల ఇంజనీర్స్ ఇండియాకు ప్రయోజనం కలగనుంది. కంపెనీకి ఆర్డర్ల రాక గత రెండు సంవత్సరాలుగా పెరిగింది. దేశీయ, విదేశీ ఆర్డర్ల మధ్య మంచి సమతౌల్యం కూడా ఉందని ఇండియా ఇన్ఫోలైన్ సంస్థ పేర్కొంది. ఇవన్నీ కేవలం ఇండియా ఇన్ఫోలైన్ సంస్థ సూచనలు, అభిప్రాయాలు మాత్రమే. ఏ సూచనను పాటించే ముందు అయినా సమగ్రంగా విచారించుకోవాలి. సొంతంగా అధ్యయనం కూడా చేయాలి. అన్నీ సవ్యంగా ఉన్నాయనిపిస్తేనే పెట్టుబడులకు ముందుకు వెళ్లడం మంచిది.

  • Loading...

More Telugu News