spiders spiinthara: సాలె పురుగులకు ఒబామా, డికాప్రియోల పేర్లు!
- కొత్తగా కనిపెట్టిన సాలీడులకు ప్రముఖుల పేర్లు
- ప్రపంచగతిని మార్చిన వారికి అరుదైన గౌరవం
- అమెరికాలో వెర్మెంట్ యూనివర్సిటీ పరిశోధకుల ఆలోచన
జమైకా, క్యూబా, ప్యూర్టిరికో, ఫ్లోరిడా, దక్షిణ కరోలినా ప్రాంతాల్లో కొత్తగా కనిపించిన `స్పింథారస్` జన్యువుకు చెందిన సాలె పురుగులకు అమెరికాలోని వెర్మెంట్ యూనివర్సిటీ పరిశోధకులు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో పేర్లు పెట్టారు. యూనివర్సిటీ విద్యార్థులు కనిపెట్టిన 15 కొత్త సాలీడులకు వారికి నచ్చిన పేర్లు పెట్టుకునే అవకాశాన్ని కల్పించినట్లు పరిశోధక బృంద నాయకుడు ఇంగీ ఆగ్నర్సన్ తెలిపారు.
కొంతమంది విద్యార్థులు వారి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోగా, మరికొంత మంది మాత్రం ప్రపంచగతిని మార్చిన ప్రముఖుల పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు డేవిడ్ అటెన్‌బరో, ఒబామా, మిచెల్ ఒబామా, డికాప్రియో, బెర్నీ సాండర్స్, డేవిడ్ బోయీ పేర్లను పెట్టినట్లు ఇంగీ వివరించారు. నవ్వుతున్న బొమ్మ మాదిరి ముఖాలతో కనిపించే ఈ జాతి సాలీడులు ఉత్తర అమెరికా నుంచి బ్రెజిల్ వరకు ఉన్న కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.