yashwant sinha: మా నాన్న మాటల్లో నిజం లేదు: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా
- జైట్లీ విధానాలు సర్వనాశనం చేస్తున్నాయన్న యశ్వంత్ సిన్హా
- ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమేనన్న జయంత్ సిన్హా
- అగ్రదేశాలకు దీటుగా ఇండియా సాగుతోందని వెల్లడి
- 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో ప్రత్యేక వ్యాసం
భారత ఆర్థిక వ్యవస్థను అరుణ్ జైట్లీ విధానాలు సర్వనాశనం చేస్తున్నాయని, దేశాన్ని ఇరవై ఏళ్లు వెనక్కు నెట్టాయని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆయన కుమారుడు పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా స్పందించారు. ప్రస్తుతం ఇండియా వ్యవస్థీకరణ సంస్కరణల దిశగా సాగుతోందని, సరికొత్త భారతావనిని సృష్టించి, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించాలంటే, ఇటువంటి నిర్ణయాలు తప్పనిసరని అన్నారు.
తన తండ్రి చెప్పిన మాటల్లో నిజం లేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రపంచంలోనే అగ్రదేశాలకు దీటుగా నిలిపి ముందుకు నడిపించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యంగా ప్రజల జీవనాన్ని మరింత మెరుగుపరిచేందుకు సహకరించే నిర్ణయాలను తీసుకుంటున్నామని అన్నారు. ఈ మేరకు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' దినపత్రిక సంపాదకీయం పేజీకి ప్రత్యేక వ్యాసాన్ని జయంత్ రాశారు.
అంతకుముందు 'న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్'కు యశ్వంత్ సిన్హా రాసిన వ్యాసం పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీలో ఉంటూ ఆ పార్టీ నేతృత్వంలోని పాలనపై యశ్వంత్ విరుచుకుపడగా, ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ప్రజలకు నిజం చెప్పారని యశ్వంత్ ను కొనియాడారు. ఇక జయంత్ వ్యాసంపై ఆయన స్పందిస్తూ, ప్రభుత్వం 'పీఐబీ' (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)లో ఉంచే పత్రికా ప్రకటన మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు.
కాగా, తన వ్యాసంలో తండ్రిని ఎక్కడా ప్రస్తావించకుండానే, ఎన్డీయేకు ఏర్పడిన నష్టాన్ని నివారించే ప్రయత్నం చేశారు జయంత్ సిన్హా. కేవలం కొన్ని అంశాల ఆధారంగానే ఆ వ్యాసం రాసినట్టుందని, మూలసూత్రాలను, భారత ఆర్థిక బలాలను పరిగణనలోకి తీసుకుంటే మరింత మంచి అభిప్రాయం వచ్చి ఉండేదని అన్నారు. ఒకటి లేదా రెండు త్రైమాసికాల్లో జీడీపీ తగ్గినట్టు కనిపించిన మాట వాస్తవమేనని, ఇది తాత్కాలిక ప్రభావమేనని ఆయన అన్నారు. జీఎస్టీ అమలుతో ఆర్థిక వ్యవస్థ సరికొత్త మలుపు తిరిగిందని, దీని ప్రభావం వచ్చే ఏడాది కనిపిస్తుందని అన్నారు.