demonitisation: ఎన్నారైలకు మరో చాన్స్ ఇచ్చేది లేదు: తేల్చి చెప్పిన సుష్మా స్వరాజ్
- పాత నోట్లను మార్చుకునే అవకాశం ఇవ్వబోము
- గోపియో సమావేశంలో వెల్లడించిన సుష్మా స్వరాజ్
- ఇంకా రూ. 7,500 కోట్లు ఎన్నారైల వద్ద ఉన్నాయి
- మరో అవకాశం కావాలని కోరిన ప్రవాస భారతీయులు
పెద్ద నోట్లను ఇండియన్ బ్యాంకుల్లో మార్చుకోవడానికి ప్రవాస భారతీయులకు రెండో అవకాశం ఇచ్చేది లేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తేల్చి చెప్పారు. గత వారంలో అమెరికాలో పర్యటించిన ఆమె 'గోపియో' (గ్లోబల్ ఆర్గనైజేషన్ ఫర్ పీపుల్ ఆఫ్ ఇండియా ఆరిజిన్) ఆధ్వర్యంలో న్యూయార్క్ లో జరిగిన సభలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ విధానాన్ని ప్రకటించిన తరువాత, అధిక విలువ ఉన్న కరెన్సీని చలామణి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆపై వాటిని మార్చుకునేందుకు ఎన్నారైలకూ అవకాశాన్ని ఇచ్చారు.
దీనిపై 'గోపియో' కూడా ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. గడువులోగా ఇండియాకు రాలేకపోయిన వారికి మరో అవకాశం ఇచ్చే విషయమై సభకు హాజరైన వారు అడిగిన ప్రశ్నకు సుష్మా సమాధానం ఇచ్చారని, అటువంటి చాన్స్ ఇచ్చే ఉద్దేశం తమకు లేదని ఆమె పేర్కొన్నారని గోపియో ఆ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే ప్రవాస భారతీయులకు తగినంత సమయాన్ని ఇచ్చామని తెలిపిన సుష్మా, అందరూ తమ వద్ద ఉన్న పాత కరెన్సీని మార్చుకున్నారనే భావిస్తున్నట్టు తెలిపినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, గత సంవత్సరం నవంబర్ 8న భారత ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దును ప్రకటిస్తూ, రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గోపియో అంచనాల మేరకు విదేశాల్లో ఉన్న భారతీయులు, భారత సంతతి వ్యక్తుల వద్ద ఇంకా పాత కరెన్సీ ఉంది. వారి వద్ద చిన్న మొత్తాల్లో సుమారు రూ. 7,500 కోట్ల వరకూ కరెన్సీ ఉంది. వాటిని డిపాజిట్ చేసుకునేందుకు మరొక చాన్స్ ఇవ్వాలన్నది ఎన్నారైల కోరిక.