facebook: ఫేస్ బుక్ పై విరుచుకుపడిన ట్రంప్... స్పందించిన జుకర్ బర్గ్!
- విమర్శలనే ఎక్కువగా ప్రచారం చేస్తోందన్న ట్రంప్
- ఎలాంటి అభిప్రాయాన్నైనా చెప్పుకోవచ్చన్న మార్క్
- తప్పుడు సమాచారం ఉంటే తొలగిస్తామన్న ఫేస్ బుక్ చీఫ్
ఫేస్ బుక్ తనకు వ్యతిరేకంగా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడిన నేపథ్యంలో ఆ సంస్థ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ స్పందించారు. సోషల్ మీడియాలో ఫేస్ బుక్, తన బలంతో విమర్శలను ఎక్కువగా ప్రచారం చేస్తోందని, 'వాషింగ్టన్ పోస్టు' వంటి ప్రముఖ పత్రికలు సైతం తనను వ్యతిరేకించాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నాయని ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఇక దీనిపై మార్క్ స్పందిస్తూ, ఎవరు ఎటువంటి ఆలోచనను, అభిప్రాయాన్నైనా తమ ప్లాట్ ఫామ్ పై పంచుకోవచ్చని, ఆ స్వాతంత్ర్యం ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు. అదే స్వాతంత్ర్యంతో ట్రంప్ కూడా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు.
కాగా, ఇటీవలి కాలంలో తప్పుడు సమాచారం ఫేస్ బుక్ మాధ్యమంపై శరవేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని పలువురు తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం అధ్యక్ష ఎన్నికల సమయంలో అమెరికన్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు రష్యా నుంచి ఫేస్ బుక్ మాధ్యమాన్ని వాడుకున్నారన్న విమర్శలూ వెల్లువెత్తాయి. తమ సామాజిక మాధ్యమ ప్లాట్ ఫారాలపై సాధ్యమైనంత వరకూ తప్పుడు సమాచారం లేకుండా చూడాలన్నదే తమ అభిమతమని, ఓ చిన్న సమాచారం తప్పని తెలిసినా వెంటనే సరిచేసుకుంటామని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. తమపై వచ్చే విమర్శలు అర్థరహితమని అన్నారు.