china: భారత్-చైనా దేశాల మధ్య బంధం వర్షాకాలంలో వర్షం లాంటిది: చైనా కాన్సులేట్ జనరల్
- ఈ స్నేహ బంధంపై ఒక్కోసారి మబ్బులు కమ్ముకుంటాయి
- ఒడిదుడుకులెదురైనా శాంతియుతంగా కలిసి పనిచేయాలి
- గమ్యం చేరేవరకు ఒకే పడవలో ప్రయాణించాలి
భారత్- చైనా మధ్య స్నేహ సంబంధాలను వర్షాకాలంలో కురిసే వానతో పోల్చారు ఆ దేశ కాన్సులేట్ జనరల్ హెంగ్ జియూన్. పీపుల్స్ రిపబ్లిక్ చైనా 68వ వార్షికోత్సవం సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్-చైనాల మధ్య బంధం వేర్వేరు సంవత్సరాల్లో నమోదయ్యే వర్షపాతాన్ని పోలి ఉంటుందని అన్నారు. తమ మైత్రిపై కొన్నిసార్లు మేఘాలు కమ్ముకుంటాయని చమత్కరించారు.
తమ రెండు దేశాల మధ్య సంబంధాలు అనేక ఒడిదుడుకులకు లోనైనప్పటికీ శాంతియుతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానంగా గత మూడేళ్లలో ఈ సంబంధాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయని డోక్లాం ప్రతిష్టంభనను ఉద్దేశించి పేర్కొన్నారు. భారత్- చైనా- భూటాన్ ట్రైజంక్షన్ వంటి సమస్యలను పక్కనపెట్టి రెండు దేశాలు సహకరించుకోవాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. గమ్యం చేరేవరకు రెండు దేశాలు ఒకే పడవలో ప్రయాణించాలని ఆయన అభిలషించారు.