ttd: కడప నేతకు టీటీడీ ఛైర్మన్ పదవి?
- ఛైర్మన్ పదవిని ఆశిస్తున్న పలువురు కీలక నేతలు
- తెరపైకి పుట్టా సుధాకర్ యాదవ్ పేరు
- త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం
- యనమలకు వియ్యంకుడు సుధాకర్
అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఛైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. నందమూరి హరికృష్ణ, మురళీమోహన్, రాయపాటి సాంబశివరావు వంటి నేతలు కూడా ఈ పదవిపై ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో, తెరపైకి సరికొత్త పేరు వచ్చింది. కడప జిల్లా టీడీపీ నేత, మైదుకూరు నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ను ఈ పదవి వరించనున్నట్టు తాజా సమాచారం. టీడీపీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. చదలవాడ కృష్ణమూర్తి ఛైర్మన్ గా ఉన్న టీటీడీ పాలకమండలి పదవీకాలం ఇప్పటికే ముగిసిపోయింది. ఇంకా కొత్త పాలకమండలిని నియమించలేదు. చాలా మంది నేతలు ఛైర్మన్ పదవిపై ఆశ పెట్టుకోవడంతో... నియామకాలు ఆలస్యమవుతున్నాయి. కొసమెరుపు ఏమిటంటే... సుధాకర్ యాదవ్ మంత్రి యనమల రామకృష్ణుడికి వియ్యంకుడు కూడా.