southwest airlines: కుక్కల కోసం విమానంలోంచి మహిళను ఈడ్చేసిన పోలీసులు...వైరల్ వీడియో చూడండి
- అమెరికాలోని సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ లో పోలీసుల దౌర్జన్యం
- కుక్కలున్నాయి, వాటిని దించేయాలన్న ప్రయాణికురాలిని దించేసిన పోలీసులు
- వాదించి, వేడుకున్నా పట్టించుకోని పోలీసులు
- బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లిన పోలీసులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్...ఎయిర్ లైన్స్ పై తీవ్ర విమర్శలు
అమెరికాలోని సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానంలో చోటుచేసుకున్న ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాని వివరాల్లోకి వెళ్తే... సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో బాల్టిమోర్ నుంచి లాస్ ఏంజెల్స్ వెళ్లేందుకు ఒక మహిళ విమానం ఎక్కింది. ఆమె విమానంలో ప్రవేశించేసరికే అందులో రెండు కుక్కలు కూడా ఉన్నాయి. వాటిని చూసిన ఆమె నేరుగా విమాన సిబ్బంది వద్దకు వెళ్లి.. కుక్కలంటే తనకు అలెర్జీ అని, వాటి కారణంగా ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, శునకాలను విమానం నుంచి దించేయాలని కోరింది.
దానికి నిరాకరించిన సిబ్బంది ఆమెనే దిగిపోవాలని సూచించారు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను దింపేసేందుకు ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది సహాయం కోరారు. వారు వచ్చి ఆమెను బలవంతంగా విమానంలోంచి ఈడ్చి పడేశారు. ఆమెను ఈడ్చుకెళ్తున్న సమయంలో "మా నాన్నకి సర్జరీ ఉంది. నేను కచ్చితంగా వెళ్లాలి. నన్ను పంపించండి" అంటూ ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదు.
'నేను నడవగలను, దయచేసి నా మీద చేతులు వేయకండి, నేనొక ప్రొఫెసర్ ని' అంటూ ఆమె వివరించే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకుండా ఆమెను బయటకి లాగేశారు. ఈ తతంగం మొత్తాన్ని హాలీవుడ్ నిర్మాత బిల్ డుమాస్ తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో వేగంగా స్పందించిన ఎయిర్ లైన్స్ అధికారులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆమెను విమానం నుంచి దించడానికి స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం అని ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి క్రిస్ మెయిన్జ్ అభిప్రాయపడ్డారు.
శునకాలతో తన ఆరోగ్యానికి ఇబ్బంది అని ఆమె మెడికల్ సర్టిఫికెట్లు చూపించి ఉంటే ఆమె ప్రయాణానికి ఇబ్బంది ఉండకపోయి ఉండేదని ఆయన తెలిపారు. కాగా, గత ఏప్రిల్ లో ఒక ప్రయాణికురాలికి ఇలాంటి అనుభవమే ఎదురుకాగా, ఆమె దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ ఎయిర్ లైన్స్ ను పలువురు బహిష్కరించారు. దీంతో దిగివచ్చిన ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.