Hyderabad: కిడ్నీ దానంపై అవగాహనా లోపం... తండ్రి కోసం ప్రాణత్యాగం చేసిన కుమారుడు!
- కిడ్నీలు పాడైపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగి మహేష్ కుమార్
- తండ్రి అనారోగ్యంతో దిగాలు పడ్డ ప్రణవ్ కుమార్
- కిడ్నీలు కావాలనడంతో ఆత్మహత్య చేసుకున్న ప్రణవ్
- సూసైడ్ నోట్ లో తన కిడ్నీలు తండ్రికి వాడాలని సూచన
అవగాహనా లోపంతో తండ్రి కోసం ప్రాణత్యాగం చేసిన కుమారుడి ఉదంతం హైదరాబాదులో వెలుగు చూసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే...హైదరాబాదులోని దూద్ బౌలి ఉందాబజార్ కు చెందిన మహేష్ కుమార్ టీఎస్ఆర్టీసీలో ఉద్యోగి. ఆయన రెండు కిడ్నీలు పాడైపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. దీంతో ఆవేదన చెందిన ఆయన కుమారుడు ప్రణవ్ తండ్రిని రక్షించుకోవడానికి తన కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
అయితే ఈ విషయంలో అవగాహన లేని ప్రణవ్.. తాను మరణిస్తే తన కిడ్నీలను తండ్రికి అమర్చవచ్చని భావించి, ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులకు ప్రణవ్ రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో తన కిడ్నీలు తన తండ్రికి అమర్చాలని ప్రణవ్ కోరాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.