yashwant sinha: మళ్లీ చెబుతున్నా... జైట్లీ చేస్తున్నది ముమ్మాటికీ తప్పే: యశ్వంత్ సిన్హా
- ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధం
- జీఎస్టీకి వ్యతిరేకమని చెప్పలేదు
- హడావుడిగా తీసుకురావడమే తప్పు
- మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా
రెండు రోజుల క్రితం ఓ దినపత్రికకు ప్రత్యేక వ్యాసం రాస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఎన్నో అంశాలను ప్రస్తావిస్తూ, మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపగా, తన వ్యాఖ్యలన్నీ ముమ్మాటికీ నిజమేనని యశ్వంత్ మరోసారి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు అక్షర సత్యాలని, జైట్లీ విధానం ముమ్మాటికీ తప్పని ఆయన అన్నారు.
తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, దీనిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే దిగజారిందని, రోజురోజుకూ మరింతగా క్షీణిస్తోందని అన్నారు. వస్తు సేవల పన్నుకు తాను అనుకూలమేనని చెప్పిన యశ్వంత్ సిన్హా, ఆ బిల్లును హడావుడిగా తెచ్చి అమలు చేస్తుండటమే తన అభ్యంతరమని అన్నారు.
వ్యాపారులెవరికీ జీఎస్టీపై పూర్తి అవగాహన లేదని పేర్కొన్న ఆయన, జీడీపీ ఒక్కసారిగా కుదేలు కావడానికి కారణం ఇదేనని అన్నారు. కాగా, యశ్వంత్ చేసిన వ్యాఖ్యలను విపక్ష కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న యశ్వంత్ కుమారుడు జయంత్ సిన్హా, ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ, తన తండ్రి అభిప్రాయంతో తాను ఏకీభవించడం లేదని తెలిపారు.