trump: పొరపాటున ఓటర్ల జాబితాలో మహిళగా రిజిస్టర్ చేయించుకున్న ట్రంప్ అల్లుడు
- 8 ఏళ్లుగా ఓటు వేస్తున్న జారెడ్ కుష్నర్
- ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా రిజిస్టరయ్యాడని ఆరోపణ
- ఆధారాలు చూపించిన అమెరికా మీడియా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ఇవాంకా ట్రంప్ భర్త, అధ్యక్షుని సలహాదారు అయిన జారెడ్ కుష్నర్ గురించి ఇటీవల అమెరికా మీడియా కొన్ని కథనాలను ప్రసారం చేసింది. న్యూజెర్సీ ప్రాంతానికి చెందిన జారెడ్ 2009 నవంబర్‌లో న్యూయార్క్ ఓటర్ల జాబితాలో తన అలవాటులో పొరపాటుగా తనను తాను మహిళగా పేర్కొన్నాడనేది ఆ కథనాల సారాంశం.
అమెరికాలోని ఇతర రాష్ట్రాల్లో కూడా జారెడ్‌కు ఓటు హక్కు ఉందని అమెరికా పత్రిక `ద వైర్డ్` ఆధారాలతో సహా ప్రచురించింది. డొనాల్డ్ ట్రంప్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంత మంది కూడా ఇలా ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటును నమోదు చేయించుకున్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. 2009కు ముందు కూడా న్యూజెర్సీలో ఓటుహక్కును రిజిస్టర్ చేసుకునే సమయంలో అతను జెండర్ వద్ద ‘తెలియదు’ అని పేర్కొన్నట్లు కథనాలు వచ్చాయి.
ప్రస్తుతం మధ్య ఆసియా ప్రాంతాల్లో శాంతి స్థాపన కోసం అమెరికా తరఫున అధికారిక ప్రతినిధిగా జారెడ్ పనిచేస్తున్నారు. గతంలో కూడా ప్రామాణిక సెక్యూరిటీ క్లియరెన్స్ పత్రాన్ని నింపడంలో జారెడ్ తడబడ్డాడు. ఆ పత్రాన్ని తప్పులతడకగా పూర్తి చేయడంతో అనేక మంది అతన్ని విమర్శించారు. సరిగ్గా అధికారిక పత్రాలను నింపడం రాని వ్యక్తి దేశ భద్రత విషయాలను ఎలా సద్దుమణిగేలా చేయగలడని చాలా మంది ఆరోపించారు.