jayalalitha: మగతలోనూ మాట్లాడుతూనే ఉన్న జయలలిత... తొలి మెడికల్ రిపోర్టు వెలుగులోకి!
- గత సంవత్సరం సెప్టెంబర్ 22న అపోలోలో చేరిన జయలలిత
- చేరినప్పటికే న్యుమోనియా, బీపీ
- శరీరంలో ఆక్సిజన్ 43 శాతమే
- జయ మృతిపై మొదలైన విచారణ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణకు ఆదేశించిన తరువాత, ఇంతకాలం మరుగున పడిపోయిన తొలి మెడికల్ రిపోర్టు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం సెప్టెంబర్ 22న ఆమెను ఆసుపత్రిలో చేర్చిన వేళ, ఊపిరి పీల్చుకునేందుకు ఆమె కష్టపడుతున్నారని, మగతలో ఉన్నప్పటికీ, మాట్లాడారని చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు తమ తొలి మెడికల్ రిపోర్టులో పేర్కొన్నారు.
న్యుమోనియా, అధిక రక్తపోటుతో ఆమె బాధపడుతూ ఉన్నారని, షుగర్ లెవల్స్ చాలా తక్కువగా ఉన్నాయని కూడా ఇందులో ఉంది. కేవలం 43 శాతం ఆక్సిజన్ మాత్రమే ఆమె శరీరంలో ఉందని తమిళ మీడియా చేతికి చిక్కిన ప్రాథమిక వైద్య నివేదికలో ఉంది. కాగా, బ్రిటన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్ బేలే ఇచ్చిన నివేదిక, వైద్యుల తొలి నివేదిక ఒకేలా ఉన్నాయని సమాచారం.
ఆమె మృతిపై నియమించిన విచారణ కమిషన్, జయలలిత ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి మరణించే వరకూ జరిగిన అన్ని పరిణామాలనూ విచారించనుంది. అసలు జయలలితను ఎందుకు ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందన్న కోణం నుంచి ఈ విచారణ ప్రారంభం కాగా, ఆమెకు జరిగిన చికిత్స, అవయవాలు పనిచేయకుండా పోయిన వైనం తదితరాలతో పాటు, ఆమెను చూసేందుకు వీవీఐపీలను కూడా అనుమతించలేదన్న ఆరోపణలపైనా సమగ్ర విచారణ జరపనుంది.