tourism awards: జాతీయ ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా మధ్యప్రదేశ్... వరుసగా మూడోసారి
- సెప్టెంబర్ 27 - ప్రపంచ పర్యాటక దినం
- అవార్డులు బహూకరించిన రాష్ట్రపతి
- మొత్తం పది అవార్డులు కైవసం చేసుకున్న మధ్యప్రదేశ్
సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినం సందర్భంగా జాతీయ పర్యాటక అవార్డులను కేంద్రం అందజేసింది. ఈసారి కూడా ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా మధ్యప్రదేశ్ జాతీయ అవార్డు గెల్చుకుంది. మధ్యప్రదేశ్ వరుసగా మూడోసారి ఈ అవార్డును సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన వేడుకలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను బహూకరించారు.
ఈ వేడుకలో మొత్తంగా పది అవార్డులను మధ్యప్రదేశ్ కైవసం చేసుకుంది. మోస్ట్ ఇన్నోవేటివ్ టూరిస్ట్ ప్రొడక్ట్ (హనువాంతియా జల్ మహోత్సవ్), బెస్ట్ అడ్వెంచర్ టూరిజం, ఉత్తమ వారసత్వ నగరం (చందేరీ), ఉత్తమ పర్యాటకహిత రైల్వేస్టేషన్ (ఉజ్జయినీ రైల్వే స్టేషన్) వంటి వివిధ అవార్డులను మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ గెల్చుకుంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యాటక మంత్రిత్వ శాఖకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.