icici: గృహరుణాలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్.... ప్రకటించిన ఐసీఐసీఐ
- ప్రతి వాయిదా మీద ఒక శాతం క్యాష్‌బ్యాక్
- కనీసం 15 ఏళ్ల కాలానికి గృహరుణం తీసుకుంటే ఆఫర్ వర్తింపు
- కొత్తగా తీసుకునే వారిని ఆకర్షించే ప్రయత్నం
అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ పండగ సందర్భంగా ఓ వినూత్న ఆఫర్ ప్రవేశపెట్టింది. కొత్తగా గృహరుణం తీసుకునే వారిని ఆకర్షించడం కోసం ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో ప్రతి వాయిదాపై కొంత క్యాష్‌బ్యాక్ అందజేయనుంది. 15 సంవత్సరాల కంటే ఎక్కువ కాలవ్యవధితో గృహరుణం తీసుకునే వారికి ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తించనుంది.
ప్రతీ వాయిదాకు 1 శాతం చొప్పున డబ్బును తిరిగి చెల్లించనుంది. ఈ రకంగా చూస్తే 30 ఏళ్ల కాలానికి గృహరుణం తీసుకున్న వారికి దాదాపు 10 శాతం వరకు తిరిగి జమయ్యే అవకాశం ఉంది. ఈ ఆఫర్‌తో పాటు గృహరుణాలను తక్కువ వడ్డీరేటుకే అందజేయనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ భాగ్చి తెలిపారు.
ఈ ఆఫర్లో వినియోగదారులు తిరిగి పొందే క్యాష్‌బ్యాక్‌ను గృహరుణంలో సర్దుబాటు చేసుకోవచ్చు లేదంటే నేరుగా తమ ఖాతాల్లో జమ అయ్యేలా ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. మొదటి వాయిదా నుంచే క్యాష్ బ్యాక్ అందజేస్తారు. కాకపోతే ఆ క్యాష్‌బ్యాక్‌ను 36వ వాయిదా తర్వాత ఖాతాలో జమ చేస్తారు. అప్పటి నుంచి ప్రతి 12వ వాయిదా తర్వాత అప్పటివరకు అందజేయాల్సిన క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని క్రెడిట్ చేస్తారు. ఉదాహరణకు 30 ఏళ్ల కాలానికి రూ.30 లక్షల గృహరుణం తీసుకుంటే ప్రతి వాయిదాకు 1శాతం క్యాష్‌బ్యాక్ చొప్పున రూ.3,24,801 తిరిగి పొందవచ్చు. అదే రూ.30లక్షలు 15 ఏళ్ల కాలానికి తీసుకుంటే రూ.96,349 క్యాష్‌బ్యాక్ ద్వారా లభిస్తుంది.