donald trump: 280 అక్షరాల్లో ట్వీట్ చేసే సదుపాయం ప్రయోగ దశలో ట్రంప్‌కి లేదు!
- స్పష్టం చేసిన ట్విట్టర్
- ప్రయోగదశలో ట్రంప్ లాంటి యూజర్లు భాగం కాదన్న సహ వ్యవస్థాపకుడు
- అమెరికా ఎన్నికల్లో రష్యా ప్రభావానికి ట్విట్టర్ వేదికైందన్న ఆరోపణలపై విచారణ
ట్విట్టర్ ఇటీవల కొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతూ, ట్వీట్ చేసే అక్షరాల సంఖ్యను 140 నుంచి 280కి పెంచుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని ప్రయోగ దశలో కొంత మందికి మాత్రమే కల్పిస్తున్నారు. అయితే ఈ సదుపాయాన్ని ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మాత్రం కల్పించడం లేదని ట్విట్టర్ వెల్లడించింది.
ట్రంప్ లాగ వివాదాస్పద ట్వీట్లు చేసే వారికి కూడా ఈ సదుపాయం కల్పించారా? అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు, ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు బిజ్ స్టోన్ సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ సదుపాయాన్ని ట్రంప్ లాంటి వ్యక్తులకు కల్పించలేదని ఆయన చెప్పాడు. అంతేకాకుండా గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ ద్వారా రష్యా కలుగజేసుకుందని వస్తున్న ఆరోపణలను విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు.