donkey: ఆకలితో కారును కొరికేసిన గాడిద.. పరిహారం కట్టమన్న కోర్టు!
- జర్మనీలో విచిత్ర ఘటన
- క్యారెట్ రంగులో ఉన్న ఓ స్పోర్ట్స్ ను ఆకలితో కొరికేసిన గాడిద
- గాడిద యజమానిపై మండిపడ్డ కారు యజమాని
- 6,800 డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం
జర్మనీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. క్యారెట్ రంగులో ఉన్న ఓ స్పోర్ట్స్ కారు వెనుక భాగాన్ని ఆకలితో ఉన్న ఓ గాడిద కొరికేసింది. ఆ కారు ఓనర్ మార్కస్ జాన్ ఈ విషయాన్ని గమనించేలోపే ఆ కారు వెనుక భాగం పాడైపోయింది. ఆ సమయంలో వెనుక నుంచి ఏవో చప్పుళ్లు రావడంతో వెనక్కి వెళ్లి చూస్తే గాడిద తన కారుని పాడుచేసిందని తెలిసిందని మార్కస్ జాన్ తెలిపాడు. కారుపై ఉన్న పెయింట్ కూడా పాడైందని చెప్పాడు.
అనంతరం ఆ కారు యజమాని గాడిద యజమానిని డబ్బు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశాడు. అయితే, ఆ కారును వేరే చోట పార్క్ చేసుకోలేకపోయావా? అని ఆ గాడిద యజమాని.. మార్కస్ జాన్‌ను ప్రశ్నించి, నష్ట పరిహారం ఇవ్వలేదు. దీంతో మార్కస్ జాన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ గాడిద తన కారును క్యారెట్ అనుకుని కొరికేయడానికి ప్రయత్నించిందని మార్కస్ జాన్ చెప్పాడు. ఆ గాడిద యజమాని 6,800 డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.