AP: ఆర్టీసీ దసరా కానుక.. పదవీ విరమణ అధికారులకు ప్రయాణం ఉచితం!

  • ఉభయ రాష్ట్రాల ఆర్టీసీ సంయుక్త నిర్ణయం
  • అధికారులకు మాత్రమే పరిమితం చేయడంపై కార్మికుల ఆగ్రహం
  • తమకూ ఆ అవకాశం కల్పించాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీలు సంయుక్తంగా సంస్థ అధికారులకు దసరా కానుక ప్రకటించాయి. రాష్ట్ర విభజనకు ముందు పదవీ విరమణ చేసిన అధికారులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. విభజనకు ముందు డిపో మేనేజర్, ఆ పైస్థాయి అధికారులుగా పదవీ విరమణ పొంది రిటైర్ అయిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అధికారితోపాటు ఆయన భార్య/భర్తకు ఈ సదుపాయాన్ని సంస్థ కల్పించింది. అయితే ప్రీమియం కేటగిరీ బస్సుల్లో మాత్రం రాయితీ ధరకు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఆర్టీసీ తాజా నిర్ణయం ప్రకారం.. ఈడీ, హెచ్ఓడీలు తెలంగాణ సిటీ ఏసీ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం డీలక్స్ బస్సులకే పరిమితం. ఎస్ఎస్ఓలు, జేఎస్ఓలకు తెలంగాణలో సిటీ బస్సులు, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణం ఉచితం. ఏపీలో డీలక్స్ వరకు ప్రయాణించొచ్చు. అన్ని స్థాయిల అధికారులు రెండు రాష్ట్రాల్లోనూ డీలక్స్ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు.

సూపర్ లగ్జరీ, ఆ పై స్థాయి సర్వీసుల్లో 50 శాతం రాయితీతో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో అన్ని స్థాయిల అధికారులు ఏపీ బస్సుల్లో డీలక్స్, అల్ట్రా డీలక్స్ ప్రయాణాలు ఉచితం కాగా, తెలంగాణ బస్సుల్లో డీలక్స్ సర్వీసుల్లో రాయితీ లేదు. సూపర్ లగ్జరీ, ఆ పైస్థాయి సర్వీసుల్లో రెండు రాష్ట్రాల బస్సుల్లో 50 శాతం రాయితీ ఉంది.

ఆర్టీసీ తాజా నిర్ణయంపై కార్మకులు మండిపడుతున్నారు. కేవలం అధికారులకు మాత్రమే ఈ వెసులుబాటును ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. కార్మికులకూ ఈ అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News