jayalalitha: తమిళనాడులో అధికారపక్షంపై ప్రతిపక్షాల ఫైర్.. జయ మరణంపై స్టాలిన్ ప్రశ్నల వర్షం!
- మరోమారు హాట్ టాపిక్‌గా మారిన ‘అమ్మ’ మరణం
- పది ప్రశ్నలు సంధించిన స్టాలిన్
- ఇప్పటికైనా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్
జయలలిత మృతి తమిళనాడులో మరోమారు చర్చనీయాంశమైంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. జయ అపోలో ఆసుపత్రిలో చేరిన సమయంలో నమోదు చేసిన పేషెంట్ కేర్ రిపోర్టు రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిని ఓ తమిళ చానల్ బయటపెట్టింది. ఈ రిపోర్టుపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రభుత్వానికి పది ప్రశ్నలు సంధించారు.
జయలలితను ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చినప్పుడు ఆమె భద్రతా విభాగంలోని అంబులెన్స్‌లో కాకుండా ప్రైవేటు అంబులెన్స్‌లో ఎందుకు తరలించాల్సి వచ్చిందని నిలదీశారు. అపస్మారక స్థితిలో ఉన్నారని చెబుతున్న జయలలిత.. పన్నీర్ సెల్వానికి బాధ్యతలు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. జయ ఆసుపత్రిలో ఉన్న 75 రోజులు ఆమె జడ్ ప్లస్ భద్రతా సిబ్బంది ఏమైపోయారన్నారు. జయ ఆరోగ్యంపై కేంద్ర హోంశాఖకు నివేదిక వెళ్లిందీ, లేనిదీ చెప్పాలని డిమాండ్ చేశారు.
స్పృహలో లేని జయ ఉప ఎన్నిక సమయంలో బీఫాం పత్రాలపై వేలిముద్ర ఎలా పెట్టారని స్టాలిన్ ప్రశ్నించారు. జయలలిత చుట్టూ వున్న వారు ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేశారా? ఉంటే, ఏయే పథకాలకు ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి వాడుకున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తాను లేవనెత్తిన ఈ ప్రశ్నలు తాను వ్యక్తిగతంగా అడుగుతున్నవి కావని, ఇన్ని రోజులుగా ప్రజల మనసుల్లో అనుమానాలుగా మిగిలిపోయిన వాటిని మాత్రమే తాను అడుగుతున్నానని స్టాలిన్ పేర్కొన్నారు. జయ మరణంపై ఇప్పటికైనా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.