elan musk: మరో ఐదేళ్లలో అంగారకుడిపై కాలనీ... ఒక్కో రాకెట్ లో వంద మంది మనుషులను పంపిస్తా: ఎలాన్ మస్క్

  • టెస్లా విద్యుత్ కార్లతో పాటు, స్పేస్ ఎక్స్ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్
  • 2024 కల్లా అంగారకుడిపై కాలనీ 
  • ఒక్కో రాకెట్ లో వంద మంది ప్రయాణం
  • అంగారక యాత్రకు ఒక్కొక్కరికి కోటీ నలభై లక్షల ఖర్చు

మరో ఐదేళ్లలో అంగారకుడిపై మనుషుల కాలనీ నిర్మిస్తానని టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ (46) ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ సమాఖ్యలో ఆయన తన భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. గతంలో చెప్పినట్టు 2024 కల్లా అంగారకుడిపైకి మనుషులను పంపి తీరతానని పునరుద్ఘాటించారు. దీని కోసం బీఎఫ్‌ఆర్‌ అనే ఓ భారీ రాకెట్‌ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ బీఎఫ్‌ఆర్‌ రాకెట్‌ ఒక్కోదానిలో 40 కేబిన్లు ఉంటాయని తెలిపారు. అందులో వందమంది ప్రయాణించవచ్చని వెల్లడించారు. 2024 నాటికి నాలుగు బీఎఫ్ఆర్ రాకెట్లను అంగారకుడిపైకి ప్రయోగిస్తామని, వాటిలో రెండు బీఎఫ్ఆర్ రాకెట్లు మనుషులను రవాణా చేస్తాయని ఆయన తెలిపారు.

అంటే సుమారు 200 మంది తొలిసారి అంగారకుడిపైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో వ్యక్తి ప్రయాణానికి కోటీ నలభై లక్షల ధర ఉండచ్చని ఆయన తెలిపారు. ఇప్పటికే నాసా తరఫున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు, వ్యోమగాములను తన స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా సరఫరా చేస్తున్న మస్క్.. ఫాల్కన్‌–9తోపాటు డ్రాగన్, ఫాల్కన్‌ హెవీ పేరుతో వేర్వేరు సామర్థ్యాలు గల రాకెట్లను తయారు చేస్తున్నారు. ఈ ఫాల్కన్ 9 రాకెట్ రెండు దశల రాకెట్. తొలి భాగం నుంచి విడిపోయిన తరువాత రెండో భాగం అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుని తిరిగి భూమి మీద ల్యాండ్ కాగలదు. మొదటి భాగం కూడా తరువాతి ప్రయోగానికి ఉపయోగపడేలా ఆయన తీర్చిదిద్దారు.

 బీఎఫ్‌ఆర్‌ లో ఇలాంటివి ఉండవు. ఇంధనం మండే ప్రాంతం.. ప్రయాణికులు లేదా సరుకులు ఉండే చోటు అన్నీ ఒకే రాకెట్‌ లో ఉంటాయి. వీటిల్లో వెళ్లే వారు అంగారకుడిపై కాలనీతో పాటు ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి, తిరుగు ప్రయాణానికి ఇంధనం తయారు చేసుకుని, మళ్లీ భూమి మీదకు చేరుకుంటారని ఆయన చెప్పారు.

కాగా, ఎలాన్ మస్క్ ఇప్పటికే టెస్లా పేరుతో విద్యుత్‌ కార్లను తయారు చేసే కంపెనీని స్థాపించారు. స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ సీఈవోగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తాను తయారు చేసిన రాకెట్లతో ఇంధనాన్ని, వ్యోమగాములను రవాణా చేస్తున్నారు. హైపర్‌ లూప్‌ పేరుతో గంటకు 1,300 కి.మీ. వేగంతో గొట్టాల్లాంటి వాహనాల్లో ప్రయాణించే సరికొత్త రవాణా వ్యవస్థకు ఆలోచన చేశారు. అంతే కాకుండా వినియోగించేసిన రాకెట్లతో సరికొత్త రవాణా వ్యవస్థను రూపొందిస్తానని తెలిపారు. విమానాలకు బదులుగా రాకెట్లను రవాణాకు వాడడం ద్వారా కేవలం అరగంట లేదా గంటలోనే సుదూర తీరాలను చేరవచ్చని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News