sucha singh langah: పంజాబ్ మాజీ మంత్రిపై అత్యాచారం కేసు...వీడియో సాక్ష్యం అందజేసిన బాధితురాలు!
- పంజాబ్ లో రెండు సార్లు పీడబ్ల్యూడీ, వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన లంగాహ్
- 2009లో తొలిసారి మంత్రిని కలిశానన్న బాధితురాలు
- ఏడాదికే తన భర్త మరణించాడన్న మహిళ
- 2009 నుంచి తనను శారీరకంగా వాడుకున్నాడని ఫిర్యాదు
పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక మరో పదిరోజుల్లో జరగనుంది. ఇంతలో శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు సూచా సింగ్ లంగాహ్ (57) పై రేప్ కేసు నమోదైంది. ఈ మేరకు ఫిర్యాదుతో పాటు, సాక్ష్యంగా వీడియో ఉన్న పెన్ డ్రైవ్ ను కూడా బాధితురాలు పోలీసులకు అందజేసింది. 2009 నుంచి లంగాహ్ తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది.
2009లో తొలిసారి తాను మంత్రిని కలిశానని, ఆ తరువాత ఏడాదికే తన భర్త మరణించాడని ఆమె తెలిపింది. తనకు ఉద్యోగమిప్పిస్తానని చెప్పి శారీరకంగా వాడుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, తన ఆస్తులను విక్రయించి డబ్బు తీసుకుని మోసం చేశాడని ఆమె వాపోయింది. దీంతో జిల్లా అటార్నీ సలహాతో లంగాహ్ పై కేసు నమోదు చేశామని గుర్ దాస్ పూర్ డీఎస్పీ ఆజాద్ దేవిందర్ సింగ్ తెలిపారు. ఈ కేసు నేపథ్యంలో, రెండుసార్లు పీడబ్ల్యూడీ, వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన లంగాహ్... శిరోమణి అకాలీదళ్ అధ్యక్షపదవికి, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీలకు రాజీనామా చేశారు.