stick fight: దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధం!
- దేవరగట్టులో మాలమల్లేశ్వర స్వామి కల్యాణం సందర్భంగా కర్రల సమరం
- మద్యం తాగకూడదు, కర్రలకు ఇనుప చువ్వలు, రింగులు ఉండకూడదన్న నిబంధన
- సీసీ, డ్రోన్ కెమెరాల సాయంతో.. 1200 మంది పోలీసుల భద్రత
కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. దేవరగట్టు కొండ ప్రాంతంలో వెలసిన మాల మల్లేశ్వరస్వామి రథోత్సవం సందర్భంగా నిర్వహించే బన్నీ ఉత్సవాన్నే కర్రల సమరంగా పేర్కొంటారు. ఈ కర్రల సమరంలో రెండు వర్గాలుగా విడిపోయే గ్రామ ప్రజలు స్వామి వారి విగ్రహాన్ని చేజిక్కించుకునేందుకు కర్రలతో దాడులు చేసుకుంటారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున గాయాలపాలవుతారు. కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు.
దీంతో ఈ ఉత్సవంపై నిషేధం ఉంది. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి సంప్రదాయం పేరిట ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో మద్యం తాగకూడదని పోలీసులు నిబంధన విధించారు. అలాగే కర్రలకు ఇనుప చువ్వలు, ఇనుప రింగులు ఉంచకూడదని తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. హద్దు మీరితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 1200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.