operation: గుంటూరు ఆసుపత్రిలో క్లిష్టమైన ఆపరేషన్: 'బాహుబలి' సినిమా చూపిస్తూ.. సర్జరీ!
- ఇంట్రా ఆపరేటివ్ నేవిగేషన్ విధానంలో ఆపరేషన్
- ఇరు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి
- రోగి మెలకువగా ఉండేందుకు సినిమా చూపించారు
గుంటూరులోని తులసి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు వినూత్న రీతిలో ఆపరేషన్ చేశారు. ఓ మహిళకు 'బాహుబలి' సినిమా చూపిస్తూ శస్త్ర చికిత్సను నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే, గుంటూరుకు చెందిన వినయకుమారి ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది. ఆమెకు ఫిట్స్ రావడంతో గుంటూరు తులసీ ఆసుపత్రికి తరలించారు. ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన తర్వాత, ఆమె తలలో గడ్డ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలిపారు. ఈ నెల 26 ఆపరేషన్ జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ఇంట్రా ఆపరేటివ్ నేవిగేషన్ విధానంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ సందర్భంగా రోగి మెలకువగా ఉండేందుకు ఆమెకు ఇష్టమైన బాహుబలి సినిమాను వైద్యులు చూపించారు. ఆమెతో మాట్లాడుతూనే డాక్టర్లు ఆపరేషన్ ను పూర్తి చేశారు. దాదాపు గంటన్నర సేపు జరిగిన సర్జరీలో ఐదుగురు డాక్టర్లు పాల్గొన్నారు.