paritala sriram: నేడు చంద్రబాబు, కేసీఆర్ కలిసే అవకాశం లేనట్టే!
- నేడు పరిటాల శ్రీరామ్ వివాహం
- హాజరుకానున్న చంద్రబాబు, కేసీఆర్
- అరగంట వ్యవధిలో వేదికపైకి
- వివాహ ఏర్పాట్లు పూర్తి
నేడు తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవి, సునీతల కుమారుడు శ్రీరామ్ వివాహం అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరగనుండగా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు హాజరుకానున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకే సమయంలో వివాహ మండపానికి వస్తారని తొలుత భావించినా, అరగంట వ్యవధిలో వచ్చి ఇద్దరు నేతలూ వధూవరులను ఆశీర్వదిస్తారని, వీరు కలిసే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఈ ఉదయం పుట్టపర్తికి చేరుకునే కేసీఆర్, అక్కడి నుంచి హెలికాప్టర్ లో వెంకటాపురం వెళతారని, మధ్యాహ్నం 12 గంటల తరువాత నూతన దంపతులను ఆశీర్వదించి వెనుదిరుగుతారని తెలుస్తోంది. చంద్రబాబునాయుడు ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య వివాహానికి హాజరై, ఆపై వెళ్లిపోతారని సమాచారం. దీంతో ఇద్దరు నేతలూ కలుసుకునే అవకాశాలు దాదాపు లేనట్టేనని సమాచారం.
కాగా, వివాహాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేదికపై 300 మంది అతిథులు, వేదిక దిగువన 50 వేల మంది ఆహ్వానితులు ఆసీనులయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 11 వంట బృందాలు సుమారు 3 లక్షల మందికి వండి వడ్డించేందుకు సిద్ధం కాగా, సామాన్య ప్రజలు, పరిటాల అభిమానులకు 17 రకాల వంటకాలతో విందు ఏర్పాట్లు జరుగుతున్నాయి.