India-Pakistan: భారత్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా పాక్ మరో కుట్ర.. సరిహద్దులో భారీ సొరంగ నిర్మాణం
- పాక్ కుట్రను బట్టబయలు చేసిన బీఎస్ఎఫ్
- భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు సొరంగ నిర్మాణం
- ఆయుధాలు, ఆహార పదార్థాలు స్వాధీనం
భారత్‌ను ఏదో విధంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాకిస్థాన్ మరో భారీ కుట్రకు తెరతీసింది. పాక్ భూభాగం నుంచి భారత్‌లోకి పెద్ద సొరంగం తవ్వి దాని ద్వారా ఉగ్రవాదులను పంపాలన్న దాయాది పన్నాగాన్ని బీఎస్‌ఎఫ్ భగ్నం చేసింది. జమ్ముకశ్మీర్‌లోని అర్నియా సెక్టారులోని అంతర్జాతీయ సరిహద్దులో 14 అడుగుల పొడవైన సొరంగాన్ని బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. అర్నియా సబ్-సెక్టార్‌లోని డమలా నల్లా వద్ద ఈ సొరంగాన్ని గుర్తించినట్టు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ సొరంగంలో కొందరు వ్యక్తుల కదలికలు కనిపించడంతో జవాన్లు వారిపై కాల్పులు జరిపారు. దీంతో వారు పాకిస్థాన్ వైపు పరారయ్యారు. అయితే వారు ఉగ్రవాదులా? కార్మికులా? అనేది తెలియరాలేదన్నారు. సొరంగం నుంచి ఆహార పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఉగ్రవాదులు ఆయుధాలు, ఆహార పదార్థాలను పట్టుకుని పాకుతూ వెళ్లేందుకు వీలుగా ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నట్టు వివరించారు.
ప్రస్తుతం సొరంగం బయటపడిన ప్రాంతంలోనే ఇటీవల పాక్ దళాలు భారత పోస్టులపైకి కాల్పులకు దిగాయి. సొరంగాన్ని నిర్మిస్తున్న కార్మికులకు, ఉగ్రవాదులకు అండగా ఉండేందుకే ఈ కాల్పులు జరిపినట్టు ఇప్పుడు భావిస్తున్నారు.
శుక్రవారం ఆర్ఎస్ పురా సెక్టార్‌లో సెక్టార్ కమాండర్ స్థాయి ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తామని ఈ సమావేశంలో పాక్ రేంజర్లు అంగీకరించారు. ఆ మరుసటి రోజే ఈ సొరంగం బయటపడడం గమనార్హం.