in flight call: నెరవేరనున్న విమాన ప్రయాణికుల కల... ప్రయాణంలోనూ కాల్స్ చేసుకోవచ్చు!
- విమానాల్లో వైఫై ఆధారిత తరంగాలు
- కన్సల్టేషన్ పేపర్ విడుదల చేసిన ట్రాయ్
- అభిప్రాయాలు చెప్పేందుకు 27 వరకూ గడువు
- వచ్చే సంవత్సరంలో తీరనున్న కల
విమానంలో ప్రయాణిస్తూ, తమ స్మార్ట్ ఫోన్ల నుంచి కాల్స్ చేసుకోవాలన్న ప్రయాణికుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. వైఫైని వాడుకుంటే విమానం గాల్లో ఉన్న వేళ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించేందుకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) నిర్ణయించుకుంది. ఇందుకోసం విధివిధానాలను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. గత కొంతకాలంగా ఇన్-ఫ్లయిట్ కనెక్టివిటీ (ఐఎఫ్సీ) సౌకర్యం కల్పించాలని ప్రయాణికుల నుంచి నానాటికీ డిమాండ్ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నో దేశాల విమానయాన సంస్థలు ఇప్పటికే ఐఎఫ్సీ సౌకర్యాన్ని ప్రయాణికులకు దగ్గర చేశాయి. ఇక ఇండియాలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం, కొత్త విమానాశ్రయాలు వస్తుండటంతో డిమాండ్ కు తగ్గట్టుగా, అందుబాటులోని సాంకేతికతను ఉపయోగించుకుని విమానం గాల్లో ఉన్న వేళ కూడా తమ వారితో మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించేందుకు ట్రాయ్ నిర్ణయం తీసుకుని, గత శుక్రవారం నాడు వివిధ ఇండస్ట్రీ సంఘాలు, ప్రజల అభిప్రాయాన్ని కోరుతూ కన్సల్టేషన్ పేపర్ ను విడుదల చేసింది.
దీనిపై ఈ నెల 27లోగా అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలని, కౌంటర్ కామెంట్స్ కు నవంబర్ 3 వరకూ సమయం ఉంటుందని, ఆ తరువాత తమ తుది నిర్ణయం వెలువడుతుందని ట్రాయ్ స్పష్టం చేసింది. శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వైఫై తరంగాలను అందుకుని, వాటిని విమానంలోని ప్రయాణికులకు ఉచితంగానే అందించాలన్నది ట్రాయ్ అభిమతం.
తొలి దశలో ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం, అన్ని విమానాలకూ ఈ సదుపాయాన్ని కల్పించే దిశగా ట్రాయ్ అడుగులు వేస్తోంది. భూ ఉపరితలానికి 10 వేల మీటర్ల ఎత్తులో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, తమ బంధుమిత్రులతో మాట్లాడుకునే సదుపాయం వచ్చే సంవత్సరం సాకారం కావచ్చని అంచనా.