digvijay singh: ఆరు నెలల పాటు ఒక్క ట్వీట్ కూడా చేయను: శపథం చేసిన దిగ్విజయ్ సింగ్
- 3,300 కి.మీ. యాత్ర చేపట్టిన దిగ్విజయ్ సింగ్
- ఇక రీట్వీట్ లు.. స్పందనలు మాత్రమే
- స్పష్టం చేసిన దిగ్విజయ్
- నదులపై ప్రజల్లో అవగాహన పెంచుతానని వెల్లడి
ఎప్పుడూ తన వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆరు నెలల పాటు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఒక్క ట్వీట్ కూడా చేయబోనని, ఎవరైనా చేసిన ట్వీట్ నచ్చితే దానిపై తన స్పందనలు మాత్రమే తెలియజేస్తానని స్పష్టం చేశారు. ఆ ట్వీట్ గురించి మరింత మందికి చెప్పాలని భావిస్తే, రీట్వీట్ చేస్తానని అన్నారు.
ఆరు నెలల పాటు నర్మదా యాత్ర పేరిట 3,300 కిలోమీటర్ల దూరాన్ని చుట్టి రావాలని నిర్ణయించుకున్న దిగ్విజయ్ సింగ్, నర్సింగపూర్ నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ ఆరు నెలలూ తాను రాజకీయాలను పక్కన బెట్టి, నదులు, వాటిపై ప్రాజెక్టులు, మరోపకాక్ జరుగుతున్న అవినీతిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకుని ఆయన యాత్రను ప్రారంభించారు.
కాగా, మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దిగ్విజయ్ ఈ యాత్రను చేపట్టారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరగని పనని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కాగా, ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తన పరపతిని కోల్పోయిన దిగ్విజయ్ సింగ్, తిరిగి పూర్వ వైభవాన్ని సాధించేందుకే యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా, మధ్యప్రదేశ్ కు జీవనాధారమైన నర్మదా నది గురించి ప్రజలకు చెప్పేందుకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఓ యాత్రను తలపెట్టిన సంగతి తెలిసిందే.