merat bhootomwala mandir: ఇండియాలో దెయ్యాలు నిర్మించిన దేవాలయం... రాత్రికి రాత్రే నిర్మించాయట!

  • మీరట్ సమీపంలో భూతోమ్ వాలా మందిర్
  • సిమెంట్ వాడకుండా నిర్మాణం
  • ప్రకృతి విపత్తులనూ తట్టుకుని నిలిచిన శివాలయం
  • నాలుగు మతాలకు ప్రతీకని చెప్పే స్థానికులు

ప్రతి మతానికీ ప్రార్థనాలయాలు ఉంటాయి. ఏ మతానికి చెందిన వారు ఆ మతానికి చెందిన ఆలయాల్లో పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తూనే ఉంటారు. ఆలయాలకు లేదా ప్రార్థనా స్థలాలకు వెళితే, కోరిన కోరికలు తీర్చుకోవడంతో పాటు మనశ్శాంతి లభిస్తుందని అత్యధికులు నమ్ముతుంటారు కూడా. ఇక ఇండియాలో ఓ శివాలయాన్ని దెయ్యాలు కట్టాయని చెబుతుంటారంటే నమ్ముతారా? అది కూడా రాత్రికి రాత్రే కట్టాయని.. ఈ శివాలయం మీరట్ సమీపంలో ఉందని తెలుసా?

స్థానికంగా 'భూతోమ్ వాలా మందిర్'గా పిలుచుకునే ఈ ఆలయాన్ని దెయ్యాలు ఒక్క రాత్రిలో నిర్మించాయని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అందుకు తగ్గట్టే ఆలయం మొత్తం ఎర్రని ఇటుకలతో నిర్మించబడి ఉంటుంది. ఇటుకల మధ్య ఎటువంటి సిమెంటునూ వాడినట్టు కనిపించదు. ఎన్నో ఏళ్ల క్రితం ఆలయ నిర్మాణం జరిగిందని, అప్పటి నుంచి ఇది చెక్కు చెదరలేదని ఆలయంలో పనిచేస్తున్న నాలుగో తరం పూజారి రాకేష్ కుమార్ గోస్వామి చెబుతున్నారు.

ఎటువంటి ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులూ ఆలయాన్ని వందల ఏళ్లుగా ఏమీ చేయలేకపోయాయని ఆయన అన్నారు. ఒక్కసారి మాత్రం ఆలయ శిఖరం దెబ్బతిందని చెబుతూ, అందుకు కారణాన్ని వెల్లడించారు. ఆలయాన్ని నిర్మిస్తున్న దెయ్యాలు, శిఖరాన్ని కడుతుండగా, సూర్యోదయం జరిగిందని, దీంతో అవి వెళ్లిపోయాయని తెలిపారు. ఆపై ఎన్నో ఏళ్ల తరువాత స్థానికులు శిఖరాన్ని నిర్మించారని, మానవ నిర్మితం కాబట్టే శిఖరం పర్యావరణ మార్పులకు ప్రభావితమైందని తెలిపారు.

తమ గ్రామానికి భూతోమ్ వాలా మందిర్ రక్షణగా నిలిచిందని, కరవు కాటకాలు తమ గ్రామం దరికి చేరవని, ఇతర ప్రాంతాలు వరదలో మునిగినా తమ గ్రామానికి ఏమీ కాదని, అందుకు దెయ్యాలు నిర్మించిన ఆలయం ఉండటమే కారణమని చెప్పుకొచ్చారు. ఈ ఆలయం నాలుగు మతాలకు ప్రతీకని ఇక్కడి వారు చెప్పుకుంటుండటం గమనార్హం.

ఆలయంలో శివుని విగ్రహం ప్రతిష్ఠించబడి వుండగా, ఆలయం లోపలివైపున అన్నీ ఎరుపు ఇటుకల మధ్య రెండు, నాలుగు ఇటుకలు క్రీస్తు శిలువ ఆకృతిలో ఉంటాయని, లోపలి భాగం మసీదును తలపిస్తుందని, గురుద్వారా పోలికలూ ఉంటాయని అంటున్నారు. ఇక దెయ్యాలు ఆలయాన్ని కట్టాయనడం పుకారేనని వాదించే చరిత్రకారులు, ఈ విషయంలో వేలాది సంవత్సరాలుగా ప్రజల్లో నానుకుపోయిన నమ్మకాన్ని చెరపలేకపోతున్నామని అంటున్నారు. ఈ ఆలయం క్రీస్తు శకం 3వ శతాబ్దంలో నిర్మించి ఉండవచ్చని పురావస్తు శాఖ అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News