india: మళ్లీ పని ప్రారంభించిన చైనా... అరుణాచల్ సరిహద్దుల్లో కొత్త హైవే ప్రారంభం!
- 409 కి.మీ. టోల్ ఫ్రీ రోడ్డు ప్రారంభం
- లాసా నుంచి నింగ్జి వరకూ నిర్మాణం
- సైనిక అవసరాల కోసమే!
డోక్లామ్ లో రహదారి నిర్మాణానికి బరితెగించి, ఆపై విఫలమై వెనకడుగు వేసిన చైనా, ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో టిబెట్టుకు దగ్గరగా ఉన్న 409 కిలోమీటర్ల టోల్ ఫ్రీ హైవేను ప్రారంభించింది. టిబెట్ ప్రొవిన్షియల్ రాజధాని లాసా నుంచి అరుణాచల్ సరిహద్దుల్లోని నింగ్జి వరకూ ఈ రహదారిని సుమారు 5.8 బిలియన్ డాలర్లతో చైనా నిర్మించింది. టిబెట్ లోని ప్రముఖ టూరిస్టు ప్రాంతాలను కూడా ఇది కలుపుతుందని చైనా ప్రభుత్వ అధికార వార్తా సంస్థ 'క్నిన్హువా' ప్రకటించింది. ఈ రోడ్డు మార్గం అందుబాటులోకి రావడంతో రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 8 గంటల నుంచి 5 గంటలకు తగ్గిందని పేర్కొంది.
కాగా, ఈ జాతీయ రహదారిని సైనిక అవసరాలకు వాడుకునే నిమిత్తమే చైనా నిర్మించిందని తెలుస్తోంది. ఆయుధాలు, ట్యాంకర్లు, తేలికపాటి క్షిపణులను సులువుగా భారత సరిహద్దుల వైపు తీసుకురావడమే చైనా లక్ష్యమని సమాచారం. ఇదిలావుండగా, ప్రస్తుతానికి ఈ హైవేపై హెవీ ట్రక్కుల రాకపోకలపై నిషేధం ఉందని 'క్సిన్హువా' పేర్కొంది. ఇండియా చైనా మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం దక్షిణ టిబెట్టని, అది తమ భూభాగమేనని చైనా వితండ వాదం చేస్తున్న సంగతి తెలిసిందే. 1962 నాటి చైనా, భారత యుద్ధం తరువాత అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని, వెంటనే దాన్ని ఖాళీ చేయాలని ఇండియా డిమాండ్ చేస్తున్న విషయం విదితమే.