poonam mahajan: నన్ను లైంగికంగా వేధించారు, చెప్పలేని పనులు చేశారు: సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్
- మహిళలంతా ఎప్పుడో ఒకప్పుడు వేధింపులు ఎదుర్కొన్న వారే
- ఏం చేశాడన్నది ఆలోచించకుండా వాయించేయండి
- మహిళా శక్తి విస్తరించాలన్న పూనమ్
ఉత్తర ముంబైకి చెందిన బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ లో జరిగిన రెడ్ బ్రిక్ సదస్సులో పాల్గొన్న ఆమె, ఓ దశలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని అన్నారు. ఇండియాలో ప్రతి యువతి ఎప్పుడో ఒకప్పుడు వేధింపులకు గురయ్యారని అన్నారు.
తాకరాని చోట తాకడం వంటివి ప్రతి మహిళకూ ఎదురయ్యేవేనని అన్నారు. ఓ మోస్తరు తెలివితేటలతోనూ పురుషులు రాజకీయాల్లో రాణించగలరని, మహిళల్లో అసాధారణత ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు. తనకు ఎదురైన వేధింపుల గురించి చెబుతూ, "వర్లీ నుంచి వెర్సోవా వరకూ నేను రైల్లో వెళుతుండేదాన్ని. ఆ సమయంలో కారులో వెళ్లేందుకు అవసరమైనంత డబ్బు మా కుటుంబం వద్ద లేదు. రైల్లో నన్ను కొరకొరా చూసేవాళ్లు. ఒక్కోసారి ఆ చూపులు భరించలేనివిగా ఉండేవి. ఈ భూమిపై ప్రతి మహిళా, ముఖ్యంగా ఇండియాలోని ప్రతి స్త్రీకి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ప్రతి ఒక్కరూ అవాంఛిత తాకుళ్ల అనుభవాన్ని ఎదుర్కొన్నవారే. వాటిని చెప్పుకోలేక ఎంతో బాధపడిన వారే" అన్నారు.
మహిళలు మరింత దృఢంగా మారాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఇంతవరకూ ఓ మహిళ అధ్యక్షురాలు కాలేదని, ఇండియాలో ఆ ఘనతను మహిళకు దగ్గర చేశామని చెప్పుకొచ్చారు. అత్యంత కీలకమైన రక్షణ శాఖతో పాటు, ఎన్నో రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ సంప్రదాయం మరింతగా విస్తరించాల్సి వుందని పూనమ్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా వేధించాడని భావిస్తే, అతను ఏం చేశాడన్న విషయాన్ని పక్కనబెట్టి, చెంపలు వాయించాలని పిలుపునిచ్చారు. టీవీ చానళ్లలో ప్రసారమవుతున్న హిందీ సీరియల్స్ భారత మహిళలపై ఉన్న గౌరవభావాన్ని చెడగొడుతున్నాయని ఆరోపించారు.