monarch airlinesm: ఆగిపోయిన 'మోనార్క్'... ఎయిర్ పోర్టుల్లో నిలిచిన లక్షల మంది, 3 లక్షల ముందస్తు టికెట్లు రద్దు!
- ఇక విమానాలు నడిపించలేము
- ప్రభుత్వం కల్పించుకోవాల్సిందే
- తేల్చి చెప్పిన మోనార్క్ ఎయిర్ లైన్స్
- యూకేలో అతిపెద్ద విమానయాన సేవల సంస్థ
యునైటెడ్ కింగ్ డమ్ లోని అతిపెద్ద పౌరవిమానయాన సేవల సంస్థ మోనార్క్ ఎయిర్ లైన్స్ నేడు తన కార్యకలాపాలను నిలిపివేయగా, యూకే ఎయిర్ పోర్టుల్లో తీవ్ర సంక్షోభ వాతావరణం ఏర్పడింది. వివిధ అంతర్జాతీయ నగరాల్లో మోనార్క్ ఎయిర్ లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకున్న లక్షలాది మంది విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.
సుమారు 3 లక్షలకు పైగా ముందస్తు బుకింగ్స్ రద్దు కాగా, ఎయిర్ పోర్టుల్లో లక్షా పది వేల మంది చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. సంక్షోభ నివారణ నిమిత్తం రంగంలోకి దిగిన బ్రిటీష్ ప్రభుత్వం, ఎయిర్ పోర్టుల్లో నిలిచిన మోనార్క్ కస్టమర్లను గమ్యస్థానాలకు చేర్చేందుకు 30 విమానాలు పంపించాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ)కి ఆదేశాలు జారీ చేసింది.
విమానయాన రంగంలో పెరుగుతున్న పోటీ, లాభాలు సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే ఎయిర్ బెర్లిన్, అలిటాలియా తదితర విమాన కంపెనీలు దివాలా పిటిషన్లు దాఖలు చేసి, తమ కార్యకలాపాలను నిలిపివేయగా, ఇప్పుడు మోనార్క్ సైతం అదే దారిలో నడిచింది. కొత్తగా ఇన్వెస్టర్లు వచ్చి పెట్టుబడులు పెడితేగాని ఈ సంస్థలు తిరిగి సేవలను ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది.
"విమానాల నిర్వహణకు ఖర్చు పెరిగిపోయింది. ఇంతకాలం ఎన్నో నష్టాలను భరిస్తూ సంస్థను నెట్టుకొచ్చాం. ఇప్పుడా పరిస్థితి లేదు" అని మోనార్క్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ జాయింట్ అడ్మినిస్ట్రేటర్ బ్లెయిర్ నిమ్మో వెల్లడించారు. కాగా, మోనార్క్ పతనం ఎయిర్ బస్, బోయింగ్ సంస్థలకూ ఇబ్బందికరమైన పరిణామమేనని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
ఇప్పుడీ పరిస్థితి తలెత్తడం వల్ల దీనికి 36 ఎయిర్ బస్ జెట్ విమానాల కొనుగోలుకు ఫైనాన్స్ చేసిన సంస్థలకు, అలాగే ఈ కంపెనీకి 32 '737 మ్యాక్స్' విమానాలను అమ్మిన బోయింగ్ సంస్థకూ ఇబ్బందికరమేనని అంటున్నారు. వీటి డెలివరీ కూడా ఇంతవరకు కాలేదు. ఇప్పుడా ఆర్డర్ల భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితి నెలకొంది.
కాగా, ఇటీవలి కాలం వరకూ మోనార్క్ సంస్థ పలు ప్రధాన ఎయిర్ లైన్స్ కు గట్టి పోటీనిస్తూ, ప్రయాణికులకు సేవలందించడంలో ముందు నిలిచింది. ఇక ప్రభుత్వం కల్పించుకుంటేనే తమ కార్యకలాపాలు సాగించగలమని సీఏఏకి స్పష్టం చేశామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండ్ర్యూ స్వాఫీల్డ్ తమ ఉద్యోగులకు పంపిన ఓ మెసేజ్ లో పేర్కొనడం గమనార్హం. ఈ పరిస్థితి వచ్చినందుకు తమ కస్టమర్లకు క్షమాపణలు చెబుతున్నట్టు ఆయన తెలిపారు.