lal bahadur shastri: లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై సినిమా.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి
- ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభం
- ట్విట్టర్‌లో వెల్లడించిన దర్శకుడు
- శాస్త్రి మరణానికి గల కారణాలే ఇతివృత్తం
భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జీవితకథ, మరణం ఆధారంగా తెరకెక్కించనున్న సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించినట్లు ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. లాల్ బహదూర్ శాస్త్రి 113వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.
`ఈరోజు ఎంతో నిజాయతీ గల, అత్యంత ప్రేమ గల నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు. ఈ సందర్భంగా తాష్కెంట్‌లో ఆయన మరణం వెనక ఉన్న కారణాల ఆధారంగా తీయబోతున్న సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులను ప్రారంభించాం` అని వివేక్ ట్వీట్ చేశారు. జనవరిలో తాను లాల్ బహదూర్ శాస్త్రి మరణం గురించి సినిమా తీయనున్నానని, అందుకు ఐడియాలు కావాలని వివేక్ కోరిన సంగతి తెలిసిందే.
కాగా, తాష్కెంట్ ఒప్పందం మీద సంతకాలు చేసిన మరుసటి రోజే 1966, జనవరి 11న శాస్త్రి హృద్రోగంతో మరణించారు. అయితే అక్కడికి వెళ్లడానికి ముందు ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో ఆయన మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆయన సహజ మరణం పొందారా? లేక ఎవరైనా హత్య చేసి అలా సృష్టించారా? అనే అంశాలకు ఈ సినిమాలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.