Ashis nehra: నేనేం చేస్తానో కెప్టెన్‌కు బాగా తెలుసు.. విమర్శలను తిప్పికొట్టిన బౌలర్ నెహ్రా
- జట్టు కోసం చేయాల్సిందంతా చేస్తానన్న వెటరన్
- మూడు మ్యాచ్‌ల కోసమే ఎంపికయ్యానని వివరణ
- ట్విట్టర్ విమర్శలను పట్టించుకోబోనన్న ఫాస్ట్ బౌలర్
ఎనిమిది నెలల తర్వాత జట్టులో స్థానం సంపాదించుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన టీమిండియా క్రికెటర్ ఆశిష్ నెహ్రా తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన గురించి జట్టు కెప్టెన్‌కు, సెలక్టర్లకు తెలుసని, జట్టు గురించి కచ్చితంగా ఏదో ఒకటి చేసే సామర్థ్యం తనకుందని అన్నాడు. తనపై వస్తున్న విమర్శలను ఎంతమాత్రమూ పట్టించుకోనని పేర్కొన్నాడు. తాను కేవలం మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకే ఎంపికయ్యాను కాబట్టి పెద్ద పెద్ద లక్ష్యాలు ఏవీ తనకు లేవన్నాడు. తాను చక్కని ప్రదర్శన కనబరిస్తే మంచి వార్త అవుతుందని, లేకుంటే ఇంకా పెద్ద వార్త అవుతుందని అన్నాడు.
సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాను కాబట్టి, ట్విట్టర్‌లో తన వయసు గురించి వచ్చే వార్తలను పట్టించుకోబోనన్నాడు. ప్రస్తుతం తాను ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టానన్నాడు. కెప్టెన్, చీఫ్ కోచ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయబోనని హామీ ఇచ్చాడు. బౌలింగ్ విషయంలో జహీర్ ఖాన్ ఇచ్చిన సలహాలను పాటిస్తానని నెహ్రా పేర్కొన్నాడు.