rectum: కడుపులో 14 బంగారు బిస్కెట్లు... వైజాగ్ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ శ్రీలంక వ్యక్తి
- ఒక్కో బిస్కెట్ బరువు 100 - 150 గ్రాములు
- తేడాగా నడుస్తుండటంతో అనుమానించిన కస్టమ్స్ అధికారులు
- సహజంగానే బయటకు వచ్చిన బిస్కెట్లు
బంగారు బిస్కెట్లను అక్రమంగా తరలిస్తూ శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి వైజాగ్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. శ్రీలంక నుంచి వైజాగ్లో దిగిన అతని నడక మీద అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు అతన్ని అడ్డుకున్నారు. సోదా చేయగా మల ద్వారం వద్ద రెండు బంగారు బిస్కెట్లు దొరికాయి. దీంతో ఆ రెండు బంగారు బిస్కెట్లను తాను ప్లాస్టిక్ కవర్లో కట్టి మింగినట్లు శ్రీలంక వ్యక్తి అంగీకరించాడు.
తర్వాత అతన్ని కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ఎక్స్ రే తీయగా అతని కడుపులో ఇంకా 14 బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తేలింది. అయితే ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే సహజంగా అవి బయటికొచ్చాయి. అతను పట్టుబడిన రోజు 7 బంగారు బిస్కెట్లు బయటికి రాగా, మరుసటి రోజు మరో 7 బంగారు బిస్కెట్లు బయటికి వచ్చాయని డాక్టర్లు తెలిపారు. ఒక్కో బిస్కెట్ బరువు 100-150 గ్రాములు ఉందని వారు చెప్పారు. ప్రస్తుతం ఈ 54 ఏళ్ల స్మగ్లర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు.