vadodara: బీజేపీ కౌన్సిలర్ ను చెట్టుకి కట్టేసి కొట్టిన గుజరాత్ వాసులు!
- నిబంధనలకు అనుగుణంగా లేని ఇళ్ల కూల్చివేతపై నోటీసులు ఇచ్చిన వడోదర మున్సిపల్ కమిషనర్
- నోటీసులివ్వకుండా తన దగ్గరుంచుకున్న కౌన్సిలర్
- తమకు సమాచారం అందించలేదని కౌన్సిలర్ ను చితక్కొట్టిన స్థానికులు
బీజేపీ కౌన్సిలర్ ను చెట్టుకి కట్టేసి పిడిగుద్దులు కురిపించిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... వడోదర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని నివాసాలను అధికారులు ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్థానికులు ఆందోళన చేపట్టారు. వారంతా కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మున్సిపల్ కమీషనర్ ను నిలదీశారు.
దీంతో ఆయన తాము నోటీసులు పంపామని, అవి కౌన్సిలర్ దగ్గర ఉన్నాయని చెప్పారు. కౌన్సిలర్ తమను మోసం చేశాడని భావించిన ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై నేరుగా ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనను ప్రశ్నించగా తనవద్ద నోటీసులు లేవని చెప్పారు. దీంతో కమీషనర్ అబద్ధమాడుతున్నాడా? అంటూ నిలదీశారు. మరికొందరు ఆయనపై చేయిచేసుకున్నారు. ఆయనను చెట్టుకి కట్టేసి, చొక్కా చించి పిడిగుద్దులు కురిపించారు. తామిప్పుడు సర్వం కోల్పోయామంటూ ఆయనపై దాడికి దిగారు. ఈ సందర్భంగా పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ గా మారింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.