Soumya Swaminathan: భారతీయ వైద్యురాలికి అరుదైన గౌరవం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా నియామకం
- చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కు అంతర్జాతీయ గుర్తింపు
- ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఇది రెండో అత్యున్నత పదవి
- త్వరలోనే బాధ్యతల స్వీకరణ
భారతీయ వైద్యురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ (58)కు అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సౌమ్య జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ హెల్త్ ఏజెన్సీలో ఇది రెండో అత్యున్నత పదవి.
మంగళవారం డబ్య్లూహెచ్ఓ నాయకుల బృందం సౌమ్యను డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియెసుస్ ఈ ప్రకటన చేశారు. ఆయన 2017లో ఈ పదవిలో నియమితులయ్యారు. ఘనాకు చెందిన డాక్టర్ అనార్ఫి అసమావో-బా స్థానంలో సౌమ్య బాధ్యతలు చేపడతారు.
చిన్నపిల్లల వైద్య నిపుణురాలు, క్లినికల్ సైంటిస్ట్ అయిన సౌమ్య టీబీపై విస్తృత పరిశోధనలు చేశారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఎంబీబీఎస్, ఎండీ చేశారు.