lasvegas: లాస్ వెగాస్ నరమేధం సమయంలో వీరే హీరోలు!
- క్షతగాత్రులను కాపాడేందుకు ముందుకు కదిలిన సాటి మనుషులు
- నరమేధం ఆగిన తరువాత పరిమళించిన మానవత్వం
- అంబులెన్సుల్లో ఎక్కించేందుకు, ఆసుపత్రులకు తరలించేందుకు తాపత్రయం
లాస్ వెగస్ స్ట్రిప్ లో మాండలే బే రిసార్ట్ లో చోటుచేసుకున్న నరమేధం సమయంలో జనం ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కుకు పరుగులు తీస్తే... కొంత మంది మాత్రం అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. వచ్చే చావును ఎవరూ ఆపలేరని భావించి, కొంత మందినైనా కాపాడుకుందామని దైర్యంగా ముందడుగు వేశారు. వారిలో మాజీ సైనికుడు రాబ్ లెడ్ బెటర్ (42) ఒకరు.
ఇరాక్ లో అమెరికా సైన్యానికి ‘స్నైపర్’ గా పని చేసిన రాబ్ లెడ్ బెటర్.. కాల్పుల శబ్దం వినగానే అప్రమత్తమయ్యాడు. ఇంతలో బులెట్ గాయమైన సోదరుడితో పాటు తన భార్య, స్నేహితులు, బంధువులను వేగంగా వీఐపీ ఏరియాలోకి తరలించాడు. మళ్లీ బయటకు వెళ్లి అనేక మంది క్షతగాత్రులకు సాయపడ్డాడు.
యుద్ధభూమిలో రక్తస్రావం జరిగితే ఏం చేస్తారో అక్కడ ఆయన అదే చేశారు. బుల్లెట్ గాయాలతో షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డవారికి ధైర్యం చెబుతూ, రక్తస్రావం జరగకుండా ఉండేలా వారి దుస్తులతో కట్లు కట్టాడు. బుల్లెట్ గాయాలైన పదిమందిని ట్రక్ లో తీసుకుని ఆసుపత్రికి వెళ్లాడు. జాచ్ అనే మరో వ్యక్తి, మరుగుదొడ్ల కోసం ఏర్పాటు చేసిన ట్రాలీలో 9 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకుని వెళ్లి రక్షించాడు.
టెన్నీసీలోని ఒక ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేస్తున్న సోనీ మెల్టన్ తన భార్య హీథర్ కు బుల్లెట్లు తగలకుండా రక్షణ గా నిలిచి ప్రాణత్యాగం చేశాడు. ఘటన జరిగిన తరువాత అక్కడ మానవత్వం పరిమళించింది. ఎంతో మంది తమ స్నేహితులు, బంధువులు, అపరిచితులను అంబులెన్సుల్లో ఎక్కిస్తూ, తీవ్రంగా గాయపడి ప్రాణాపాయంలో ఉన్నవారికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ కనిపించారు. వారంతా అక్కడ హీరోలుగా నిలిచారు.